ఖతార్ ప్రధానికి సారీ చెప్పిన నెతన్యాహు.. వైట్ హౌస్ నుంచి ఫోన్ కాల్

  • దోహాపై ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడి
  • హమాస్ నేతలను మట్టుబెట్టేందుకేనని అప్పట్లో వివరణ
  • ఇజ్రాయెల్ దాడిపై ట్రంప్ ఆగ్రహం
  • నెతన్యాహుతో సారీ చెప్పించిన అమెరికా అధ్యక్షుడు
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖతార్ ప్రధానికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచే నెతన్యాహు ఈ ఫోన్ కాల్ చేయడం గమనార్హం. ఖతార్ రాజధాని దోహాపై ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిపట్ల నెతన్యాహు విచారం వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

అసలేం జరిగిందంటే..
గాజా యుద్ధం, హమాస్ తో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడితో చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాషింగ్టన్ వెళ్లారు. సోమవారం వైట్ హౌస్ లో నెతన్యాహుతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దోహాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారని, ఓవైపు శాంతి చర్చలు జరుపుతుండగా దాడి ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

ఖతార్ తమకు మంచి మిత్రుడని ట్రంప్ తరచుగా మీడియా ముందు వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చి ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానికి ఫోన్ చేయించారని, దోహా దాడికి క్షమాపణ చెప్పించారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఖతార్ కూడా ఈ ఫోన్ కాల్ నిజమేనని నిర్ధారించింది. దోహాపై దాడి పట్ల నెతన్యాహు విచారం వ్యక్తం చేశారని, భవిష్యత్తులో అలాంటి దాడులు పునరావృతం కానివ్వబోమని హామీ ఇచ్చారని ఖతార్ పేర్కొంది.


More Telugu News