వాహనదారులకు బిగ్ రిలీఫ్.. హై సెక్యూరిటీ ప్లేట్లపై ఎలాంటి గడువు లేదు!
- సెప్టెంబర్ 30 గడువంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న రవాణాశాఖ
- వాహనదారులకు ఎలాంటి జరిమానాలు విధించడం లేదని స్పష్టత
- ఆందోళన చెందవద్దని వాహనదారులకు అధికారుల సూచన
గత కొన్ని రోజులుగా పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లు తప్పనిసరి అని, నిర్దేశిత గడువులోగా మార్చుకోని వారిపై ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని రవాణా శాఖ అధికారులు పూర్తిగా ఖండించారు. పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లు బిగించేందుకు ఇప్పటివరకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి పాత వాహనాలకు నంబర్ ప్లేట్ల మార్పు అంశం ప్రభుత్వ పరిశీలన దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదని వివరించారు. ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, నంబర్ ప్లేట్ల మార్పుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలని రవాణా శాఖ వర్గాలు ప్రజలకు సూచిస్తున్నాయి.