బెజవాడ కనకదుర్గమ్మకు థాంక్స్ చెప్పాలనుంది: సింగర్ సునీత

  • ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
  • అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సింగర్ సునీత 
  • ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన సింగర్ సునీత
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. సాధారణ భక్తులతో పాటు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా స్వయంగా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు లలితా త్రిపురసుందరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ.. "దసరా సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది ప్రభుత్వ సమర్థవంతమైన ఏర్పాట్లకు నిదర్శనం" అని అన్నారు.

అందరినీ చల్లగా చూస్తూ దర్శనమిస్తున్న అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పాలని ఉందని ఆమె అన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా 11 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని కొనియాడారు. ప్రభుత్వానికి అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ నగరం అంతటా ఉత్సవ శోభ వెల్లివిరుస్తోందని సునీత పేర్కొన్నారు. 


More Telugu News