ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు... అక్టోబరు 4న ఆర్థికసాయం

  • ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం
  • అక్టోబరు 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు నగదు జమ
  • రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది డ్రైవర్లకు ప్రయోజనం
  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
  • అర్హులైన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ప్రభుత్వం హామీ
  • పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకున్న వారికీ వర్తింపు
రాష్ట్రంలోని లక్షలాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. అర్హులైన ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వచ్చే నెల (అక్టోబర్) 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2.9 లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రయోజనం పొందనున్నారు.

నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 'సూపర్ సిక్స్' పథకాలు, ఎన్డీయే కూటమి మేనిఫెస్టో హామీల అమలుపై జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న ప్రతి డ్రైవర్‌ను ప్రభుత్వం ఆదుకుంటుందని, వారి సంక్షేమానికి అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

"ఈ పథకానికి అర్హులుగా 2,90,234 మంది డ్రైవర్లు ఉన్నారు. ఏదైనా కారణాలతో లబ్దిదారుల జాబితాలో అర్హులైన వారి పేరు లేకపోతే... వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తాం. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో స్కీంను వర్తింపచేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి యేటా రూ.435 కోట్ల ఖర్చు అవుతుంది. గత ప్రభుత్వం రూ.12 వేలు మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం రూ.15 వేలు అందించేందుకు నిర్ణయించింది” అని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఈ సందర్భంగా డ్రైవర్లకు సంబంధించిన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సమస్యలు ఉన్న డ్రైవర్లు వాటిని క్లియర్ చేసుకున్న వెంటనే వారికి కూడా ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


More Telugu News