నేను వీకెండ్ పొలిటీషియన్‌ను కాదు.. విజయ్‌కు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్

  • తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు దగ్గరపడుతున్న సమయం
  • పార్టీల నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు
  • తాను ప్రజల మధ్యే ఉంటున్నానన్న ఉదయనిధి
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా, నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాను కొందరిలా 'వారాంతపు రాజకీయ నాయకుడిని' కాదంటూ ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, తాను వారంలో చాలా రోజులు అధికారిక పర్యటనలతో ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు. "కొందరిలా కేవలం శనివారాల్లో మాత్రమే బయటకు వచ్చే నేతను నేను కాదు. ఆదివారాల్లో కూడా పర్యటనలు చేస్తుంటాను. నాకు ఈ రోజు ఏ వారం అన్నది కూడా గుర్తుండదు" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విజయ్ ప్రతి శనివారం రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీ తరఫున విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా విజయ్‌ను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. గతేడాది ఆయన 'తమిళగ వెట్రి కళగం' పేరుతో సొంత పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేసిన విజయ్, వారాంతాల్లో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రచార శైలిని విమర్శిస్తూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 


More Telugu News