పసికందు పెదాలకు గ్లూ పూసి అడవిలో వదిలేసిన కసాయి తల్లి

  • అక్రమ సంబంధంతో పుట్టిన బిడ్డను వదిలించుకోవాలని పన్నాగం 
  • తొలుత బిడ్డను అమ్మేందుకు ప్రయత్నించిన మహిళ
  • విఫలం కావడంతో తండ్రితో కలిసి అడవిలో వదిలేసి వెళ్లిన వైనం
పందొమ్మిది రోజుల పసికందు పట్ల కన్నతల్లే కసాయిగా ప్రవర్తించింది. బిడ్డను అడవిలో వదిలేసి వెళ్లింది. ఆకలితో బిడ్డ ఏడిస్తే ఎవరైనా గుర్తిస్తారనే భయంతో ఆ పసికందు పెదాలను గ్లూతో అతికించింది. అక్రమ సంబంధం వల్ల పుట్టడమే ఆ పసికందు చేసిన పాపం.. తండ్రితో కలిసి తల్లి ఈ దారుణానికి పాల్పడింది. రాజస్థాన్ లోని బిల్వారాలో జరిగిన ఈ ఘటన వివరాలు..

బిల్వారా అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఓ పసికందును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రోజుల పసిగుడ్డు పరిస్థితిని చూసి తీవ్రంగా చలించిపోయారు. పెదాలను గ్లూతో అతికించడంతో ఏడిచేందుకూ వీలులేని పరిస్థితిలో ఉన్న ఆ పసికందును వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. అనంతరం దర్యప్తు చేపట్టి పాప తల్లిని, తాతను అదుపులోకి తీసుకుని విచారించగా దారుణమైన విషయాలు బయటపడ్డాయి.

మహిళ అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చడంతో ఆమె తండ్రి బుండిలో మారుపేరుతో ఓ గది అద్దెకు తీసుకుని అందులో ఉంచాడు. కాన్పు అయ్యాక పసికందును అమ్మే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో బిడ్డను తీసుకుని బుల్వారా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. బిడ్డ ఏడుపు ఎవరికీ వినిపించకుండా ఉండాలని పెదాలను గ్లూతో అతికించారు. అక్రమ సంబంధం వల్ల గర్బం దాల్చడంతో ఆ విషయం బయటపడితే కుటుంబానికి చెడ్డపేరు వస్తుందనే కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆ తండ్రీకూతుళ్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పసికందు కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.


More Telugu News