ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ పేర్లు... సంచలనం సృష్టిస్తున్న కొత్త పత్రాలు

  • ఎప్‌స్టీన్ కేసు... బయటకొచ్చిన కీలక పత్రాలు
  • ఎప్‌స్టీన్ ద్వీపానికి మస్క్ వెళ్లాల్సి ఉన్నట్టు పత్రాల్లో ప్రస్తావన
  • ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేయాలంటూ ట్రంప్ సర్కారుపై మస్క్ ఒత్తిడి
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా బయటపడిన పత్రాల్లో టెక్ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పేరు ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను మస్క్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. 

డెమోక్రాటిక్ చట్టసభ్యులు విడుదల చేసిన ఆరు పేజీల పత్రంలో ఎప్‌స్టీన్‌కు చెందిన ఒక షెడ్యూల్ వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం, 2014 డిసెంబర్ 6న మస్క్.. ఎప్‌స్టీన్‌కు చెందిన వివాదాస్పద ద్వీపానికి (యూఎస్ వర్జిన్ ఐలాండ్స్) వెళ్లాల్సి ఉందని ఒక ప్రణాళికలో పేర్కొన్నారు. ఎందరో మహిళలపై లైంగిక దాడులకు వేదికగా నిలిచిన ఈ ద్వీపానికి మస్క్ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ, ఆయన పేరు పక్కన "ఇది ఇంకా ఖరారైందా?" అని రాసి ఉండటం గమనార్హం. అయితే, ఆ పత్రాల ఆధారంగా మస్క్ నిజంగా ఆ ద్వీపానికి వెళ్లారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.

ఈ వార్తలు బయటకు రాగానే ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. "ఇది అబద్ధం" అని ఒక్క మాటలో కొట్టిపారేశారు. ఈ పత్రాల్లో కేవలం మస్క్ పేరు మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ట్రంప్ మిత్రుడు స్టీవ్ బానన్ పేర్లు కూడా ఉన్నాయి. 2014 డిసెంబర్ 5న బిల్ గేట్స్‌తో, 2019 ఫిబ్రవరి 16న స్టీవ్ బానన్‌తో ఎప్‌స్టీన్ సమావేశం కావాల్సి ఉందని ఆ షెడ్యూల్‌లో ఉంది.

గత కొంతకాలంగా ఎప్‌స్టీన్ ఫైల్స్ మొత్తాన్ని విడుదల చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ కేసులో ఉన్నత స్థాయి వ్యక్తులను, ముఖ్యంగా శక్తిమంతమైన డెమోక్రాట్లను ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో పూర్తి వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గతంలో ట్రంప్ పేరు కూడా ఈ ఫైల్స్‌లో ఉందని, అందుకే వాటిని బయటపెట్టడం లేదని మస్క్ ఆరోపించినప్పటికీ, తర్వాత ఆ పోస్ట్‌ను తొలగించారు. "వాగ్దానం చేసినట్లుగా ఫైల్స్‌ను విడుదల చేయండి" అంటూ ట్రంప్‌ను ఉద్దేశించి మస్క్ ఇటీవల వ్యాఖ్యానించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.


More Telugu News