రూ.40,000 లంచం డిమాండ్... మణుగూరు ఎస్సై రంజిత్‌పై ఏసీబీ కేసు నమోదు

  • ఒక కేసులో అరెస్టుకు బదులు నోటీసులు జారీ చేయడానికి లంచం డిమాండ్
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పోలీస్ స్టేషన్ ఎస్సైపై కేసు నమోదు
  • ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకు రావాలన్న ఏసీబీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బత్తిని రంజిత్‌పై తెలంగాణ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఒక కేసులో ఇద్దరిని అరెస్టు చేయడానికి బదులు నోటీసులు జారీ చేసేందుకు వారి నుంచి రూ. 40,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

మణుగూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఫిర్యాదుదారుడు, అతని సోదరుడిపై నమోదైన కేసులో అరెస్టు చేయాల్సి ఉండగా, నోటీసులు మాత్రమే జారీ చేసేలా అధికారికంగా సహాయం చేయడానికి లంచం అడిగినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు తెలంగాణ ప్రజలకు ఒక సూచన చేశారు. ఏ ప్రభుత్వ అధికారి లేదా సేవకుడు లంచం అడిగినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. వాట్సాప్ (9440446106) ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (https://acb.telangana.gov.in) ద్వారా కూడా ఏసీబీకి సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.


More Telugu News