ప్రధాని మోదీపై నాటో చీఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేంద్రం

  • మోదీ-పుతిన్ ఫోన్ కాల్‌పై నాటో చీఫ్ మార్క్ రుట్టే వ్యాఖ్యలు
  • ఇందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసిన భారత ప్రభుత్వం
  • అలాంటి సంభాషణ ఎప్పుడూ జరగలేదన్న విదేశాంగ శాఖ
  • బాధ్యతాయుతంగా మెలగాలని నాటోకు భారత్ హితవు
  • ఇంధన అవసరాలపై నిర్ణయాలు స్వతంత్రంగానే ఉంటాయని స్పష్టీకరణ
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందంటూ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని గట్టిగా ఖండించింది.

న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, రట్టే ఒక ప్రముఖ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిందని, ఈ పరిణామంతో ప్రధాని మోదీ వెంటనే పుతిన్‌కు ఫోన్ చేసి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రణాళికలను వివరించాలని కోరారని రట్టే పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు. "నాటో చీఫ్ మార్క్ రుట్టే చేసిన ప్రకటనను మేము గమనించాం. అది వాస్తవ విరుద్ధం, పూర్తిగా నిరాధారమైనది. ప్రధాని మోదీ ఎప్పుడూ పుతిన్‌తో ఆ విధంగా మాట్లాడలేదు. అలాంటి సంభాషణ అసలు జరగనేలేదు" అని ఆయన స్పష్టం చేశారు.

నాటో వంటి ముఖ్యమైన, గౌరవనీయమైన సంస్థల నాయకత్వం బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా, కచ్చితత్వంతో వ్యవహరించాలని తాము ఆశిస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు. "ప్రధాని సమావేశాలను తప్పుగా చిత్రీకరించే, జరగని సంభాషణలను సూచించే ఊహాజనిత లేదా నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు" అని ఆయన హెచ్చరించారు.

భారత్ తన ఇంధన అవసరాల విషయంలో ఎప్పటిలాగే స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటుందని జైస్వాల్ పునరుద్ఘాటించారు. "భారత ప్రజలకు సరసమైన ధరలకు ఇంధనాన్ని అందించడమే మా ప్రథమ ప్రాధాన్యత. మా జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం" అని ఆయన వివరించారు.

రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని మార్క్ రుట్టే గతంలోనూ భారత్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని అప్పుడే భారత్ గట్టిగా బదులిచ్చింది.


More Telugu News