తెలంగాణలో భారీ వర్షాలు.. కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

  • కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్న ముఖ్యమంత్రి
  • అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే ఖాళీ చేయించాలని సూచన
  • విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖకు సూచన
రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన కీలక సూచనలు జారీ చేశారు. కలెక్టర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

అవసరమైతే ఆయా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, అలాగే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కాగా, ఈ రోజు, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


More Telugu News