విద్యాధికారిని బెల్ట్ తో చితకబాదిన హెడ్మాస్టర్.. వీడియో ఇదిగో!

  • ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఘటన
  • హెడ్మాస్టర్ తనను వేధిస్తున్నాడని మరో టీచర్ ఫిర్యాదు
  • విచారణ సందర్భంగా ఆగ్రహంతో రెచ్చిపోయిన హెడ్మాస్టర్
  • సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యాధికారి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో ఓ ఉన్నతాధికారిపై ఓ ప్రధానోపాధ్యాయుడు దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణకు పిలిచినందుకు ఆగ్రహించిన సదరు ప్రధానోపాధ్యాయుడు, తన ఆగ్రహాన్ని అణచుకోలేక బెల్ట్ తో చితకబాదాడు.

ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ, సంబంధిత ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగిందంటే..
మహ్మదాబాద్‌ లోని నద్వా ప్రాథమిక పాఠశాలలో బిజేంద్ర కుమార్ వర్మ హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నారు. అయితే, ఈయన తనను వేధిస్తున్నాడంటూ అదే స్కూల్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ టీచర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు రమ్మంటూ బిజేంద్ర కుమార్ వర్మకు విద్యాధికారి అఖిలేశ్ ప్రతాప్ సింగ్ నోటీసులు జారీ చేశారు. వేధింపుల ఘటనపై విచారిస్తున్న క్రమంలో బిజేంద్ర కుమార్ వర్మ రెచ్చిపోయాడు. 

తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ తన బెల్ట్‌ తీసి అఖిలేశ్ ప్రతాప్ సింగ్ పై దాడి చేశాడు. అక్కడే ఉన్న సిబ్బంది బిజేంద్రను బలవంతంగా గదిలో నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ.. హెడ్మాస్టర్ బిజేంద్రను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాధికారి అఖిలేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు బిజేంద్ర కుమార్ వర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News