2047 వరకు మోదీకి రిటైర్మెంట్ లేదు: రాజ్‌నాథ్ సింగ్

  • ప్రధాని మోదీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూర్తి విశ్వాసం
  • 2047 స్వాతంత్ర్య శతాబ్ది వేడుకల తర్వాతే మోదీ రిటైర్ అవుతారని ప్రకటన
  • రాబోయే అనేక ఎన్నికల్లో ఆయనే బీజేపీ ప్రధాని అభ్యర్థి అని స్పష్టీక‌ర‌ణ‌
  • ప్రజలతో మమేకమయ్యే అరుదైన సామర్థ్యం మోదీ సొంతమని ప్రశంస
  • క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీలో మోదీకి తిరుగులేదని, రాబోయే అనేక ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. 2047లో దేశ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు ముగిసిన తర్వాతే మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... "సమీప భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడదు. రాబోయే 2029, 2034, 2039, 2044 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీయే మా పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఉంటారు. 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు ముగిశాకే ఆయన రిటైర్ అవుతారు" అని తేల్చిచెప్పారు.

1980 నుంచి తనకు మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజ్‌నాథ్ గుర్తుచేసుకున్నారు. ప్రజలతో సులభంగా కలిసిపోయే అరుదైన సామర్థ్యం మోదీ సొంతమని ప్రశంసించారు. ఎంతటి సంక్లిష్ట సమస్యలనైనా సులువుగా పరిష్కరించగలరని, క్లిష్టమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. అంతర్జాతీయ సమస్యలపై కూడా ప్రపంచ దేశాల నాయకులు మోదీ సలహాలు తీసుకుంటారని తెలిపారు. ఇందరు ప్రపంచ నాయకుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న మరో ప్రధానిని తాను చూడలేదని అన్నారు.

ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, 'ఆపరేషన్‌ సిందూర్‌'కు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం మోదీ వ్యవహార శైలికి నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే సమయంలో సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని అగౌరవపరచలేదని, ఆనాడు దేశ ప్రజలే మోదీ నాయకత్వాన్ని కోరుకున్నారని ఆయన పేర్కొన్నారు.


More Telugu News