భార్యను కత్తితో నరికి చంపి పరారైన భర్త

  • మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
  • మంజులపై అనుమానంతో తరుచూ కొట్టిన భర్త
  • భర్త వేధింపుల కారణంగా సోదరి ఇంటికి వచ్చిన మంజుల
  • ఇంటికి తీసుకువెళ్లి అర్ధరాత్రి సమయంలో నరికిన భర్త
మేడ్చల్ జిల్లా, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. భార్యను కత్తితో దారుణంగా నరికి చంపి భర్త పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు సమీపంలోని అడ్డగూడురుకు చెందిన శంకర్, మంజుల దంపతులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

శంకర్, మంజులలకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం తర్వాత జీవనోపాధి కోసం వారు ముంబైకి వెళ్లారు. పెళ్లయిన మూడు సంవత్సరాల వరకు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత మంజులపై శంకర్‌కు అనుమానం కలగడంతో తరుచూ గొడవలు పడేవాడు. భర్త వేధింపులు భరించలేక మంజుల వారం రోజుల క్రితం తన సోదరి రాణి ఇంటికి చేరుకుంది. అనంతరం శంకర్ కూడా తన పిల్లలతో కలిసి అక్కడకి వచ్చాడు.

శుక్రవారం నాడు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇకపై భార్యను ఇబ్బంది పెట్టనని శంకర్ హామీ ఇచ్చి మంజులను తిరిగి ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే, అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో శంకర్ కత్తితో విచక్షణారహితంగా మంజులను నరికాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మేల్కొని అక్కడికి చేరుకునేలోపే శంకర్ పారిపోయాడు. కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News