హెచ్1బీ వీసా ఫీజు పెంపు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

  • పరాధీనతే మన నిజమైన శత్రువు అన్న ప్రధాని మోదీ
  • ఆత్మనిర్భర్ భారత్‌తోనే ప్రపంచంలో గౌరవం అని స్పష్టం
  • విదేశీ షిప్పింగ్‌పై ఏటా రూ.6 లక్షల కోట్ల భారీ వ్యయం
  • మన రక్షణ బడ్జెట్‌కు సమానమైన మొత్తమని వెల్లడి
  • కాంగ్రెస్ విధానాలతోనే షిప్పింగ్ రంగం కుప్పకూలిందని విమర్శ
భారతదేశానికి అసలైన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ బలోపేతానికి, ప్రపంచ గౌరవానికి స్వావలంబన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. హెచ్1బీ వీసా ఫీజు పెంపు వేళ, గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో శనివారం జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

"ప్రపంచంలో మనకు పెద్ద శత్రువులెవరూ లేరు. ఇతర దేశాలపై ఆధారపడటమే మన ఏకైక నిజమైన శత్రువు. ఈ పరాధీనత అనే శత్రువును మనమందరం కలిసి ఓడించాలి" అని మోదీ పిలుపునిచ్చారు. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుందని, 140 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టలేమని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం తప్పనిసరిగా ఆత్మనిర్భర్‌గా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించకుండా, విదేశీ నౌకలకు అద్దె చెల్లించడానికే వారు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. దీనివల్ల దేశంలో షిప్పింగ్ రంగం పూర్తిగా కుప్పకూలిందని, 90 శాతం వాణిజ్యం కోసం విదేశీ నౌకలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.

"ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా కోసం విదేశీ షిప్పింగ్ సంస్థలకు భారత్ ఏటా దాదాపు రూ.6 లక్షల కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తం మన రక్షణ బడ్జెట్‌తో దాదాపు సమానం" అని మోదీ వివరించారు. అమెరికా ఇటీవల హెచ్-1బీ వీసాలపై భారీగా ఫీజులు విధించడం, భారత దిగుమతులపై సుంకాలు కొనసాగించడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


More Telugu News