డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిసిన శింగనమల ఎమ్మెల్యే శ్రావణి శ్రీ

  • శింగనమల అభివృద్ధిపై పవన్‌కు ఎమ్మెల్యే శ్రావణి వినతి
  • నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు నిధులు కోరిన ఎమ్మెల్యే
  • గండికోట తాగునీటి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని వినతి
  • గత ప్రభుత్వంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపణ
  • నిధుల మంజూరుకు కృషి చేస్తానని పవన్ హామీ
శింగనమల నియోజకవర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ వెల్లడించారు. అధ్వానంగా మారిన రోడ్ల మరమ్మతులతో పాటు, కీలకమైన తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

"శింగనమల నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు, కొత్త రోడ్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి నియోజవర్గ రోడ్ల అభివృద్ధి గురించి వినతి పత్రం అంద‌జేయ‌డం జ‌రిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలోని చాలా రోడ్లు అభివృద్ధికి నోచుకోక, నిర్లక్ష్యానికి గుర‌య్యాయి. గత ప్రభుత్వం కనీసం రోడ్ల మరమ్మతు పనులు కూడా చేపట్టకపోవడంతో అనేక గ్రామాలలో రోడ్లు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. వర్షాలకు నియోజవర్గంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ దెబ్బ‌తిన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ తరఫున రోడ్ల మరమ్మతుకు, కొత్త రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు మంజూరు చేయాలని పవన్ కల్యాణ్ గారిని కోర‌డం జ‌రిగింది.

అలాగే, గండికోట రిజర్వాయర్ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్టు సమగ్ర నివేదికను ఆర్.డబ్ల్యూ.యస్, మిగతా శాఖల అధికారులు ద్వారా పరిపాలన అనుమతులు మంజూరు కొరకు సమర్పించాను. నియోజకవర్గ పరిధిలోని తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెల‌ప‌డం జ‌రిగింది. ముఖ్యంగా పుట్లూరు మరియు యల్లనూరు మండలాల్లో నీటి సమస్య పరిష్కారానికి గండికోట నీటి ప్రాజెక్టు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి ప్రాజెక్టులకు పంచాయతీ రాజ్ శాఖ తరపున అనుమతులు ఇవ్వాలని కోర‌గా.. విష‌యాల‌న్నీ విన్న ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ గారు సానుకూలంగా స్పందిస్తూ, నిధుల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇవ్వ‌డం జ‌రిగింది" అని శ్రావణి శ్రీ వివరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 


More Telugu News