ఆఫ్ఘనిస్థాన్‌లోకి మళ్లీ అమెరికా.. బగ్రామ్ స్థావరంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • ఆఫ్ఘన్‌లోని బగ్రామ్ వైమానిక స్థావరం తిరిగి కావాలన్న ట్రంప్
  • చైనా అణు కార్యకలాపాలపై నిఘా పెట్టడమే ప్రధాన లక్ష్యం
  • యూకే ప్రధానితో కలిసి విలేకరుల సమావేశంలో కీలక ప్రకటన
  • ఇప్పటికే కాబూల్‌లో తాలిబాన్లతో అమెరికా దూతలు చర్చలు
  • ఇది అధికారిక ప్రణాళిక కాదంటున్న అమెరికా రక్షణ వర్గాలు
నాలుగేళ్ల క్రితం సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్న ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ అడుగుపెట్టేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. చైనాను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌లోని కీలకమైన బగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి తమ నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఈ స్థావరం చైనా అణు కార్యకలాపాలకు సమీపంలో ఉందని తెలిపారు.

బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "మాకు ఆ స్థావరం తిరిగి కావాలి. చైనా తమ అణ్వాయుధాలను తయారు చేసే ప్రాంతానికి అది కేవలం గంట దూరంలో ఉంది" అని ఆయన స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వాణిజ్య చర్చలు జరపడానికి ఒక రోజు ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవలి సంవత్సరాలలో చైనా తన అణ్వాయుధాల సంఖ్యను వేగంగా పెంచుతుండటం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. 2024 మధ్య నాటికి చైనా వద్ద 600 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని, 2030 నాటికి వాటి సంఖ్య 1,000 దాటుతుందని, 2035 నాటికి 1,500కు చేరుతుందని పెంటగాన్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే బగ్రామ్ స్థావరంపై ట్రంప్ దృష్టి సారించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

బగ్రామ్ స్థావరాన్ని తిరిగి పొందాలంటే, ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ట్రంప్ ప్రత్యేక దూత ఆడమ్ బోహ్లర్, మాజీ రాయబారి జల్మై ఖలీల్‌జాద్ పలుమార్లు కాబూల్‌లో పర్యటించారు. ఖైదీల మార్పిడితో పాటు ఆఫ్ఘనిస్థాన్‌లో పెట్టుబడి అవకాశాలపై తాలిబన్ విదేశాంగ మంత్రితో వారు చర్చలు జరిపారు.

అయితే, బగ్రామ్ స్థావరాన్ని తిరిగి తీసుకునేందుకు ఇది నిజమైన ప్రణాళికేనా అనే దానిపై స్పష్టత లేదు. ఈ విషయంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని, కాంగ్రెస్‌కు కూడా ఎలాంటి బ్రీఫింగ్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. "అధ్యక్షుడి ఆదేశాలను అమలు చేయడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము" అని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ తెలిపారు. 2021 ఆగస్టులో అమెరికా.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వైదొలగడం గందరగోళానికి దారితీసిన విషయం తెలిసిందే. అయితే, తన మొదటి టర్మ్‌లోనే తాను బగ్రామ్‌ను అట్టిపెట్టుకోవాలని భావించినట్లు ట్రంప్ గతంలోనే తెలిపారు.


More Telugu News