వయనాడ్‌లో అరటిపండ్లతో ప్రియాంక గాంధీ తులాభారం

  • నియోజకవర్గంలో వారం రోజులుగా కొనసాగుతున్న ప్రియాంక పర్యటన
  • శుక్రవారం వయనాడ్ చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
  • స్థానికులతో మమేకమవుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎంపీ
  • ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని ప్రియాంక హామీ
కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె ముక్కం మనస్సెరీలోని శ్రీ కున్నత్ మహావిష్ణు ఆలయాన్ని సందర్శించి, అరటిపండ్లతో తులాభారం వేయించుకున్నారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంకకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వాయనాడ్ చేరుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

వారం రోజులుగా తన లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. సెప్టెంబర్ 12న ప్రారంభమైన ఈ పర్యటనలో భాగంగా ఆమె వివిధ సామాజిక, మత, వర్గాల నాయకులను వారి ఇళ్ల వద్దే కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా యువత, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై చర్చిస్తున్నారు.

ఆలయంలో తులాభారం అనంతరం, కొత్తగా నిర్మించిన ఆలయ రథాన్ని ప్రియాంక గాంధీ పరిశీలించారు. దాని నిర్మాణంలో పాలుపంచుకున్న శిల్పుల నైపుణ్యాన్ని అభినందించారు. ప్రియాంక ఆలయ సందర్శన సాంస్కృతిక సామరస్యాన్ని, ప్రజలతో ఆమెకున్న భావోద్వేగ బంధాన్ని తెలియజేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

మరోవైపు, శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో సోనియా, రాహుల్ కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వయనాడ్ చేరుకున్నారు. రాబోయే రోజుల్లో పంచాయతీ, బ్లాక్ స్థాయి సమావేశాల్లో పాల్గొననున్న ప్రియాంక, స్థానిక సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.


More Telugu News