తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్

  • సైనిక అమరవీరుల స్తూపానికి, పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి
  • నిజాం పాలనలో రజాకార్ల దారుణాలపై ప్రజలు తిరగబడిన చారిత్రాత్మక ఘట్టమని వ్యాఖ్య
  • నిజాం పాలనలో రజాకార్లు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కాదన్న రాజ్‌నాథ్ సింగ్
సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైనిక అమరవీరుల స్తూపానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, నిజాం పాలనలో రజాకార్ల దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసిన చారిత్రాత్మక సందర్భానికి సెప్టెంబర్ 17వ తేదీ ఒక గుర్తుగా నిలుస్తుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సమర్థ నాయకత్వం కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని ఆయన గుర్తుచేశారు. నిజాం పాలనలో రజాకార్లు పాల్పడిన అకృత్యాలు అసంఖ్యాకమని, వారి ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు తిరుగుబాటు చేశారని ఆయన పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ పోలో' దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమని, ఆనాడు నిజాం రాజు ఓటమిని అంగీకరించి సర్దార్ పటేల్ ముందు తలవంచారని ఆయన గుర్తు చేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అనేక రాజ్యాలు ఉండటం వల్ల దేశ సమైక్యతకు ఆటంకం ఏర్పడిందని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. అయితే, అఖండ భారత్ నినాదంతో సర్దార్ పటేల్ ముందుకు సాగి సంస్థానాలను విలీనం చేశారని ఆయన కొనియాడారు.


More Telugu News