జార్జియా సరిహద్దులో 56 మంది భారతీయులకు ఘోర అవమానం!

  • సరైన వీసాలు ఉన్నా దేశంలోకి అనుమతించని అధికారులు
  • గడ్డకట్టే చలిలో గంటల తరబడి ఆరుబయట నిరీక్షణ
  • పాస్‌పోర్టులు స్వాధీనం, కనీస సౌకర్యాల కరవు 
  • ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆవేదన పంచుకున్న బాధిత మహిళ
జార్జియాలో భారతీయ పర్యాటకులకు తీవ్ర అవమానం ఎదురైంది. సరైన పత్రాలు, ఈ-వీసాలు ఉన్నప్పటికీ 56 మంది భారతీయుల బృందాన్ని ఆర్మేనియా నుంచి జార్జియాలోకి ప్రవేశించకుండా సరిహద్దు అధికారులు అడ్డుకున్నారని, అమానుషంగా ప్రవర్తించారని ఓ మహిళ ఆరోపించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ధృవీ పటేల్ అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఆర్మేనియా, జార్జియా మధ్య ఉన్న సదఖ్లో సరిహద్దు వద్ద తమ బృందాన్ని ఐదు గంటలకు పైగా గడ్డకట్టే చలిలో నిలబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కనీసం ఆహారం గానీ, టాయిలెట్ సౌకర్యం గానీ కల్పించలేదని తెలిపారు. తమ పాస్‌పోర్టులను రెండు గంటల పాటు స్వాధీనం చేసుకుని, పశువుల్లా ఫుట్‌పాత్‌పై కూర్చోబెట్టారని ఆమె ఆరోపించారు.

అంతేకాకుండా, అధికారులు తమను నేరస్థుల్లా వీడియోలు తీశారని, కానీ తాము వీడియో తీయకుండా అడ్డుకున్నారని ధృవీ పటేల్ పేర్కొన్నారు. తమ పత్రాలను సరిగా తనిఖీ చేయకుండానే వీసాలు ‘సరిగ్గా లేవని’ చెప్పి వెనక్కి పంపారని ఆమె తెలిపారు. "జార్జియా భారతీయుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తుంది. ఇది సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదు" అని ఆమె తన పోస్టులో రాశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లను ట్యాగ్ చేశారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు స్పందించారు. గతంలో తమకు కూడా జార్జియాలో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని పలువురు కామెంట్లు చేశారు. "భారతీయుల పట్ల జార్జియా అధికారుల వివక్ష చాలా కాలంగా కొనసాగుతోంది" అని ఒకరు పేర్కొనగా, ఇది జాతి వివక్షలో భాగమేనని మరికొందరు ఆరోపించారు. ఈ సంఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.


More Telugu News