కేరళలో బాలుడిపై అత్యాచారం... నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు

  • కేరళలో 16 ఏళ్ల బాలుడిపై రెండేళ్లుగా లైంగిక దాడి
  • ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సహా 14 మందిపై ఆరోపణలు
  • గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.
  • తల్లికి అనుమానం రావడంతో వెలుగు చూసిన అఘాయిత్యం
  • పోక్సో చట్టం కింద 14 కేసులు.. ఇప్పటికే 9 మంది అరెస్ట్
సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన కేరళలో వెలుగుచూసింది. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై గత రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మొత్తం 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.  ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిందితుల్లో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. కాసరగోడ్ జిల్లాకు చెందిన బాధితుడికి ఓ గే డేటింగ్ యాప్ ద్వారా నిందితులు పరిచయమయ్యారు. స్నేహం పేరుతో దగ్గరై, గత రెండేళ్లుగా అతడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ అఘాయిత్యం కేవలం బాలుడి ఇంట్లోనే కాకుండా, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా జరిగినట్లు విచారణలో తేలింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల వయసు 25 నుంచి 51 ఏళ్ల మధ్య ఉంటుందని, వీరిలో ఒకరు రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవల ఓ రోజు బాలుడి తల్లి ఇంట్లో ఓ అపరిచిత వ్యక్తిని గమనించారు. ఆమెను చూడగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తన కుమారుడిని నిలదీయగా, రెండేళ్లుగా తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి చెప్పడంతో ఆ తల్లి హతాశురాలైంది. వెంటనే ఆమె ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు గత రెండు రోజుల్లో పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) చట్టం కింద మొత్తం 14 కేసులు నమోదు చేశారు. కాసరగోడ్‌లో నమోదైన 8 కేసుల దర్యాప్తు కోసం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. మిగిలిన 6 కేసులను కన్నూర్, కోజికోడ్ జిల్లాల పోలీసులకు బదిలీ చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేరళ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్లపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాలను మరింత కఠినతరం చేయాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


More Telugu News