రాజీనామా చేయను.. ఏం చేస్తారో చేసుకోండి.. టీసీఎస్‌ హెచ్‌ఆర్‌కు టెక్కీ షాక్

  • రాజీనామా చేయాలన్న టీసీఎస్ హెచ్‌ఆర్‌కు ఎదురుతిరిగిన ఉద్యోగి
  • సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకోవడంతో పోస్ట్ వైరల్
  • ప్రాజెక్టులు లేని ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణ
  • జీతాలు ఆపేస్తామని, బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్‌ఆర్ బెదిరింపులు
  • కంపెనీలో మానసిక వేధింపులు పెరిగాయంటూ టెక్కీ ఆవేదన
  • రతన్ టాటా తర్వాత పని సంస్కృతి మారిపోయిందని తీవ్ర విమర్శ
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో ఓ ఉద్యోగి ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంపెనీ హెచ్‌ఆర్ విభాగం తనను రాజీనామా చేయమని కోరగా, తాను అందుకు నిరాకరించినట్టు ఆ టెక్కీ రెడిట్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.

‘టీసీఎస్‌లో నా రాజీనామాను నిరాకరించాను’ అనే పోస్టుతో ఓ ఉద్యోగి తన ఆవేదనను పంచుకున్నాడు. "మూడు రోజుల క్రితం నన్నొక మీటింగ్ రూమ్‌కు పిలిచి రాజీనామా చేయమన్నారు. నేను నిరాకరించాను. ఏడుపొచ్చింది, భయమేసింది. కానీ టీసీఎస్ నా మొదటి కంపెనీ, పోరాడటానికి నేను సిద్ధపడ్డాను. ఉద్యోగం నుంచి తీసేశాక చెడ్డ రివ్యూ ఇస్తామని బెదిరించారు. 'మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను మాత్రం రాజీనామా చేసేది లేదు' అని చెప్పి ఆ గది నుంచి బయటకు వచ్చేశాను. భయంగానే ఉన్నా, ధైర్యంగా నిలబడటానికి ప్రయత్నించాను" అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చాడు.

కంపెనీలో ప్రాజెక్టులు లేకుండా ఖాళీగా (బెంచ్‌పై) ఉన్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. "వాస్తవానికి తొలగించాల్సిన వారి జాబితాలో నా పేరు లేదు. ప్రాజెక్టులు లేని వారైతే సులభంగా లొంగిపోతారని వారిని టార్గెట్ చేస్తున్నారు. మా ప్రొఫైల్స్‌ను ఫ్రీజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏ ప్రాజెక్టు మమ్మల్ని సంప్రదించలేదు. మా పరిచయాలతో ఏదైనా ప్రాజెక్ట్ సంపాదించినా, రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (ఆర్‌ఎంజీ) వాళ్లకు ఫోన్ చేసి మా కేటాయింపును రద్దు చేస్తోంది" అని ఆయన ఆరోపించారు.

తన భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని చెబుతూ "ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. నా బ్రాంచ్‌లో చాలామంది రాజీనామా చేయడానికి నిరాకరించారు. హెచ్‌ఆర్ రోజూ వారిని మీటింగ్‌లకు పిలిచి, రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారు. జీతాలు ఆపేస్తామని, బ్లాక్‌లిస్ట్ చేస్తామని, మిమ్మల్ని ఎవరూ ఉద్యోగంలో పెట్టుకోరని బెదిరిస్తున్నారు. అయినా వారు పది రోజులుగా పోరాడుతూనే ఉన్నారు" అని వివరించారు.

టీసీఎస్ పని వాతావరణంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇది పూర్తిగా మానసిక వేధింపు. జాబ్ సెక్యూరిటీ, మంచి పని సంస్కృతి ఉంటుందనే తక్కువ జీతానికైనా టీసీఎస్‌లో చేరాను. ఇప్పుడు బాధపడుతున్నాను. రతన్ టాటా లేకపోవడంతో కంపెనీ పూర్తిగా మారిపోయింది" అని తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.  


More Telugu News