గ్రూప్-1 పోస్టులపై ఆరోపణలు.. కేటీఆర్‌పై రూ. 100 కోట్లకు దావా!

  • కేటీఆర్‌పై పోలీసులకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు
  • గ్రూప్-1 పోస్టులు అమ్ముకుంటున్నారని నిరాధార ఆరోపణలు చేశారన్న దయాకర్
  • ప్రభుత్వం పరువు తీసేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం
  •  24 గంటల్లో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత డిమాండ్
  •  లేదంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా తప్పదని హెచ్చరిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. గ్రూప్-1 పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసిన ఆయన 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం దయాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న గ్రూప్-1 నియామకాలపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్కో గ్రూప్-1 పోస్టును రూ.3 కోట్లకు అమ్ముకుంటున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు.

కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని దయాకర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన గడువులోగా ఆయన స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలతో నిరుద్యోగ యువతలో అనవసర ఆందోళన, అపోహలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.


More Telugu News