Teja: థియేటర్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోంది: దర్శకుడు తేజ ఆవేదన

Teja feels afraid to go to theaters due to high prices
  • టికెట్ రేటు కంటే పాప్‌కార్న్ ధర మూడు రెట్లు అధికం - దర్శకుడు తేజ
  • ఏపీలో సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణపై ప్రభుత్వ కమిటీ సమావేశం
  • ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు అందించిన సినీ ప్రముఖులు
  • థియేటర్లలో అధిక ధరల వల్ల తానే సినిమాకు వెళ్లాలంటే భయపడుతున్నానన్న తేజ
  • పేదలకు అందుబాటులో సినిమా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
"సినిమా టికెట్ రేటు కంటే పాప్‌కార్న్ ధర మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ధరలు కచ్చితంగా తగ్గాలి. ప్రతివారం సినిమాకు వెళ్లే నేనే, ఇప్పుడు థియేటర్‌కు వెళ్లాలంటే భయపడుతున్నాను. ఎందుకంటే నేను పాప్‌కార్న్ లేకుండా సినిమా చూడలేను," అంటూ ప్రముఖ దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో సినిమా రంగ సమస్యలు, టికెట్ ధరల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం నియమించిన కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశమైంది. హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సినీ పరిశ్రమ తరఫున నిర్మాత వివేక్ కూచిబొట్ల, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అలంకార్ ప్రసాద్, దర్శకుడు తేజ, డిస్ట్రిబ్యూటర్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరల విధానం, భారీ బడ్జెట్ చిత్రాలకు ధరల పెంపు వంటి అంశాలపై కమిటీ సినీ ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది.

సమావేశం అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ.. "ప్రభుత్వం పేదలకు కూడా సినిమాను దగ్గర చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రేక్షకులకు అందుబాటులో ధరలు ఉంచుతూనే, ఇండస్ట్రీలోని వారికి నష్టం రాకుండా ఎలా సమన్వయం చేయాలనే దానిపై కమిటీ మా సలహాలు కోరింది. కథ రాసిన దగ్గర్నుంచి థియేటర్ వరకు అన్ని రంగాల్లో నాకు అనుభవం ఉంది కాబట్టి, నా అభిప్రాయాలు చెప్పాను. థియేటర్లలో క్యాంటీన్ ధరలు, టికెట్ ధరలపై చర్చ జరిగింది," అని తెలిపారు.

సినిమా ఇండస్ట్రీ తరఫున తామంతా ఈ సమావేశానికి హాజరై, తమ సమస్యలు, సూచనలు (గ్రీవియన్సెస్, సజెషన్స్) తెలియజేశామని తేజ అన్నారు. తామిచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని, త్వరలోనే దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Teja
Director Teja
Telugu cinema
cinema ticket prices
popcorn prices
AP film development corporation
ticket price rationalization
Vivek Kuchibotla
Alankar Prasad
movie industry

More Telugu News