Russia: పదేళ్లలో చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రష్యా యోచన

Russia Plans Nuclear Power Plant on Moon Within Decade
  • చంద్రుడిపై అన్వేషణలో భాగంగా కీలక ప్రాజెక్టులు చేపడుతున్న పలు దేశాలు
  • రష్యా, చైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ప్రాజెక్టు
  • 2036 నాటికి అణు విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు
వచ్చే దశాబ్ద కాలంలో చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పాలని రష్యా యోచిస్తోంది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా అణు విద్యుత్ ప్లాంట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తమ లూనార్ ప్రోగ్రాంతో పాటు రష్యా, చైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించింది.

చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించినట్లు రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్‌మస్ వెల్లడించింది. ఇందుకోసం ఏరోస్పేస్ కంపెనీ లావొచ్‌కిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. రోవర్లు, అబ్జర్వేటరీ, రష్యా, చైనా సంయుక్త పరిశోధన కేంద్రంతో పాటు తమ సొంత లూనార్ ప్రోగ్రాంకు విద్యుత్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని రష్యా పేర్కొంది.

రష్యా అంతరిక్ష పరిశోధనల్లో ముందుంది. 1961లోనే యూరి గగారిన్‌ను అంతరిక్షంలోకి పంపించింది. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు యూరి గగారిన్. అయితే గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనాతో పోలిస్తే వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. 2023లో రష్యా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లూనా-25 చంద్రుడిపై దిగడానికి ముందే కూలిపోయింది.
Russia
Lunar Program
Moon
Nuclear Power Plant
Roscosmos
China
Yuri Gagarin
Space Exploration

More Telugu News