నేను చచ్చిపోలేదు... బతికే ఉన్నా!: మాని పవార్

  • మొదటి అంతస్తు షోరూం నుంచి కిందపడ్డ మహీంద్రా థార్ కారు
  • పూజ చేస్తుండగా యాక్సిలరేటర్ నొక్కడంతో అదుపుతప్పిన వాహనం
  • ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడి
  • తాను చనిపోయానంటూ వస్తున్న నకిలీ వార్తలను ఖండించిన యువతి
  • ఫేక్ వీడియోలు ప్రచారం చేయవద్దంటూ ఇన్ స్టాగ్రామ్ లో విజ్ఞప్తి
  • ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని ఓ కారు షోరూం మొదటి అంతస్తు నుంచి సరికొత్త మహీంద్రా థార్ వాహనంతో సహా కిందపడిపోయిన యువతి.. తన మరణంపై వస్తున్న వదంతులను ఖండించారు. తాను బతికే ఉన్నానని, ఈ ప్రమాదంలో ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదని స్పష్టం చేశారు. లైకులు, వ్యూస్ కోసం కొందరు తనపై నకిలీ వార్తలు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఘజియాబాద్‌కు చెందిన 29 ఏళ్ల మాని పవార్, ఇటీవల తన కుటుంబంతో కలిసి తూర్పు ఢిల్లీలోని నిర్మాణ్ విహార్‌లో ఉన్న ఓ షోరూంకు కొత్త మహీంద్రా థార్ కారు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. వాహనాన్ని బయటకు తీసే ముందు షోరూంలోనే సంప్రదాయబద్ధంగా పూజ నిర్వహించారు. టైర్ కింద నిమ్మకాయ పెట్టే క్రమంలో ఆమె పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కారు. దీంతో దాదాపు రూ.27 లక్షల విలువైన ఆ వాహనం అదుపుతప్పి షోరూం అద్దాలను పగలగొట్టుకుని మొదటి అంతస్తు నుంచి కింద రోడ్డుపై పడి తలకిందులైంది.

ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచారాలు మొదలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆమె ముక్కు విరిగిందని, తీవ్ర గాయాలయ్యాయని, చివరికి చనిపోయిందని కూడా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మాని పవార్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో విడుదల చేశారు. "ఈ నకిలీ వార్తలను ఖండించడానికే ఈ వీడియో చేస్తున్నాను. ప్రమాదం జరిగినప్పుడు కారులో నాతో పాటు నా కుటుంబ సభ్యులు, ఓ సేల్స్‌మ్యాన్ ఉన్నారు. కారు కింద పడగానే మేమంతా ముందు డోర్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చాం. మాలో ఎవరికీ కనీసం చిన్న గాయం కూడా కాలేదు" అని ఆమె వివరించారు.

"కారు అప్పటికే హై ఆర్పీఎంలో ఉందని సేల్స్‌మ్యాన్ మమ్మల్ని హెచ్చరించారు. నేను పొరపాటున యాక్సిలరేటర్ నొక్కగానే అది ఒక్కసారిగా దూసుకెళ్లి కిందపడిపోయింది. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. దయచేసి నకిలీ వీడియోలు ప్రచారం చేయడం ఆపండి" అని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రమాదం తర్వాత తలకిందులుగా పడి ఉన్న థార్ కారు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.


More Telugu News