బాంబు పెట్టాం.. అందరినీ బయటకు పంపించండి: ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్

  • ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపుతో ఈ-మెయిల్
  • మధ్యాహ్నం లోపు కోర్టులో బాంబు పేలుతుందని హెచ్చరిక
  • వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు
  • కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించిన అధికారులు
  • రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ బృందాలు
  • ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని వెల్లడి
దేశ రాజధాని ఢిల్లీలోని హైకోర్టులో శుక్రవారం తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఆగంతుకులు పంపిన ఒక ఈ-మెయిల్ భద్రతా వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే హైకోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈరోజు మధ్యాహ్నం లోపు హైకోర్టులో బాంబు పేలుతుందని హెచ్చరిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపారు. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించారు. ముందు జాగ్రత్త చర్యగా హైకోర్టు ప్రాంగణంలోని సిబ్బందిని, న్యాయవాదులను, ఇతర సందర్శకులను వెంటనే బయటకు పంపించి, ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు.

సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్నాయి. కోర్టులోని ప్రతి గదిని, ప్రాంగణంలోని అన్ని ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాయి. ప్రస్తుతానికి ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కనిమొళి తేవిడియా పేరుతో వచ్చిన ఆ మెయిల్‌లో ఈ వారంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కుమారుడి పైనా దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించారు.

బాంబే హైకోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. న్యాయస్థానం ప్రాంగణంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని, ఇది నకిలీ బాంబు బెదిరింపుగా గుర్తించినట్లు తెలిపారు.


More Telugu News