పైలట్లు, సిబ్బందికి బ్రిటిష్ ఎయిర్‌వేస్ షాక్.. ఇకపై ఆ పనులన్నీ బంద్

  • బ్రిటిష్ ఎయిర్‌వేస్ సిబ్బందికి కొత్త నిబంధనలు
  • యూనిఫాంలో కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ తాగడంపై నిషేధం
  • బహిరంగంగా నీళ్లు కూడా జాగ్రత్తగా తాగాలని సూచన
  • బస చేసే హోటళ్ల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టొద్దని ఆదేశం
  • భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయమని కంపెనీ వెల్లడి
ప్రముఖ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్‌వేస్ తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బంది కోసం కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. సంస్థ ప్రతిష్ఠ‌, సిబ్బంది వృత్తిపరమైన రూపాన్ని కాపాడే లక్ష్యంతో ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఇకపై సిబ్బంది యూనిఫాంలో ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో కాఫీ, టీ లేదా ఇతర శీతల పానీయాలు తాగడంపై పూర్తి నిషేధం విధించింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, విమాన సిబ్బంది యూనిఫాంలో ఉండగా కేవలం నీళ్లు మాత్రమే తాగేందుకు అనుమతి ఉంది. అయితే, ఆ నీటిని కూడా ఇతరులకు పెద్దగా కనిపించకుండా జాగ్రత్తగా తాగాలని స్పష్టం చేసింది. కాఫీ, టీ వంటి ఇతర పానీయాలను కేవలం సిబ్బందికి కేటాయించిన స్టాఫ్ రూములు లేదా కేఫ్టేరియాలలో మాత్రమే సేవించాలని ఆదేశాలు జారీ చేసింది.

పానీయాలకే పరిమితం కాకుండా, సిబ్బంది సోషల్ మీడియా వాడకంపై కూడా బ్రిటిష్ ఎయిర్‌వేస్ కఠిన ఆంక్షలు విధించింది. తాము బస చేసే లేఓవర్ హోటళ్లకు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. అధునాతన ఏఐ టూల్స్ ద్వారా ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌ను విశ్లేషించి హోటల్ లొకేషన్‌ను గుర్తించే ప్రమాదం ఉందని, ఇది సిబ్బంది భద్రతకు ముప్పుగా పరిణమించవచ్చని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్న హోటల్ కంటెంట్‌ను కూడా తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది.

వీటితో పాటు సిబ్బంది యూనిఫాంలో విధులకు రావడం, ఇంటికి వెళ్లడం వంటివి కూడా చేయకూడదని ఆదేశించింది. సిబ్బందిపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఇలాంటి కఠిన నిబంధనలు విధించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా విధుల్లో ఉన్నప్పుడు యూనిఫాంలో ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని నిషేధించింది. సంస్థ తన బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకే ఈ మార్పులు చేసినట్లు చెబుతున్నప్పటికీ, ఈ నిబంధనలపై సిబ్బందిలో అంతర్గతంగా విమర్శలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.


More Telugu News