అన్నదాతను నిండా ముంచి... నేడు నీతులా?: అచ్చెన్నాయుడు

  • మాజీ సీఎం జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజం
  • యూరియా కొరత, అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం
  • రాష్ట్రంలో అవసరానికి మించి యూరియా నిల్వలున్నాయని స్పష్టీకరణ
  • గత పాలనలో రైతులను ముంచేసి ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటు
  • అసెంబ్లీకి వస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని జగన్‌కు సవాల్
  • నేపాల్ బాధితుల విషయంలో లోకేశ్ సేవలను కొనియాడిన అచ్చెన్న
ఐదేళ్ల పాలనలో రైతులను నిండా ముంచి, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా కొరత, అవినీతి అంటూ జగన్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని, ఆయనకు కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

యూరియాపై అబద్ధాల ప్రచారం

యూరియా కొరతపై జగన్ చేస్తున్నది దుష్ప్రచారమని అచ్చెన్నాయుడు కొట్టిపారేశారు. "రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, మేము ముందుజాగ్రత్తగా 7.19 లక్షల మెట్రిక్ టన్నులు సిద్ధం చేశాం. ఇప్పటికే 6.41 లక్షల టన్నులు రైతులకు పంపిణీ చేశాం. మరో 78 వేల టన్నులు నిల్వ ఉంది. ఈ నెల 22 నాటికి అదనంగా 55 వేల టన్నులు రానుంది" అని లెక్కలతో సహా వివరించారు. 

కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, మరికొన్ని చోట్ల ముందుగా వర్షాలు పడటంతో యూరియాకు తాత్కాలికంగా డిమాండ్ పెరిగిందే తప్ప, కొరత సృష్టించలేదని స్పష్టం చేశారు. యూరియా సరఫరాలో రూ.250 కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని, రైతులకిచ్చే సబ్సిడీపై ఎవరైనా అవినీతి చేస్తారా అని ప్రశ్నించారు.

అన్నింటా విఫలమయ్యారు

గత ఐదేళ్లలో జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నాశనమైందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. "జగన్ హయాంలో మామిడి, ఉల్లి, టమాటా ధరలు పడిపోతే కనీసం ఒక్క కాయ కూడా కొనలేదు. మేము అధికారంలోకి వచ్చాక మిర్చి నుంచి కొబ్బరి వరకు అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటున్నాం" అని తెలిపారు. 

వైద్య కళాశాలలకు పునాదులు వేసి వదిలేసిన జగన్, ఇప్పుడు వాటిని పీపీపీ పద్ధతిలో పూర్తి చేస్తుంటే అడ్డుకుంటానని బెదిరించడం దారుణమన్నారు. ప్రజలు 11 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా, ఆ తీర్పును గౌరవించకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రానని చెప్పడం సిగ్గుచేటన్నారు.

అదే నిజమైన నాయకత్వం

ఈ సందర్భంగా నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవడానికి నారా లోకేశ్ చేస్తున్న కృషిని అచ్చెన్నాయుడు ప్రశంసించారు. అధికారం లేకపోయినా ఉత్తరాఖండ్ వరదల సమయంలో చంద్రబాబు సొంత ఖర్చులతో బాధితులను ఎలా ఆదుకున్నారో గుర్తుచేశారు. ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే నిజమైన నాయకత్వమని, కేవలం అధికారం ఉంటేనే పనిచేస్తాననడం సరికాదని జగన్‌కు హితవు పలికారు. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కావాలని, ఆయన చెప్పే ప్రతి అబద్ధానికి వాస్తవాలతో సమాధానం ఇస్తామని సవాల్ విసిరారు.


More Telugu News