పాక్ ప్లేయర్ విషయంలోనూ ఇదే ఉదారత చూపిస్తావా సూర్య?: ఆకాశ్ చోప్రా సూటి ప్రశ్న

  • యూఏఈ బ్యాటర్‌ను రనౌట్ నుంచి కాపాడిన భారత కెప్టెన్ 
  • సూర్య నిర్ణయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
  • పాకిస్థాన్ ఆటగాడి విషయంలో సూర్య ఇలా చేసేవాడు కాదని చోప్రా అభిప్రాయం
  • ఇలాంటి ఉదారత భవిష్యత్తులో కొత్త సమస్యలు సృష్టిస్తుందని హెచ్చరిక
  • నిబంధనల ప్రకారం ఔటైతే వెనుదిరగడమే సరైన పద్ధతని సూచన
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తితో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ ఉదారతను అందరూ ప్రశంసించడం లేదు. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా దీనిపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. యూఏఈ బ్యాటర్ స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు ఉండి ఉంటే సూర్యకుమార్ ఇలాగే ప్రవర్తించేవాడా? అంటూ చోప్రా సూటిగా ప్రశ్నించాడు.

అసలేం జరిగిందంటే..!
ఆసియా కప్‌లో భాగంగా నిన్న‌ యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ జునైద్ సిద్ధిఖీ నిర్లక్ష్యంగా క్రీజు బయట ఉండటంతో వికెట్ కీపర్ సంజూ శాంసన్ చురుగ్గా స్పందించి వికెట్లను గిరాటేశాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించగా, జునైద్‌ను ఔట్‌గా ప్రకటించాడు. అయితే, భారత ఆల్-రౌండర్ శివమ్ దూబే నడుముకు ఉన్న టవల్ కింద పడటంతో తన దృష్టి మరలిందని జునైద్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇది గమనించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో జునైద్ తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు.

ఆకాశ్ చోప్రా ఏమన్నాడంటే?
ఈ ఘటనపై ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన ఆకాశ్ చోప్రా, సూర్యకుమార్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. "ఇది కేవలం సందర్భాన్ని బట్టి తీసుకున్న నిర్ణయమే. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో కీలకమైన మ్యాచ్‌లో సల్మాన్ అలీ అఘా ఇలాగే నిర్లక్ష్యంగా క్రీజు బయట ఉంటే సూర్య కచ్చితంగా ఇలా చేయడు" అని అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్ సమయస్ఫూర్తితో చేసిన రనౌట్ సరైనదేనని చోప్రా అన్నాడు.

క్రీడాస్ఫూర్తి కోణంలో ఇలాంటి నిర్ణయాలు చూడటానికి బాగున్నప్పటికీ, ఇవి భవిష్యత్తులో కొత్త సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించాడు. "ఒకసారి ఉదారంగా ప్రవర్తించి, మరోసారి కఠినంగా వ్యవహరిస్తే విమర్శలు వస్తాయి. అప్పుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు ఆ దారిలోకి ఎందుకు వెళ్లాలి?" అని చోప్రా ప్రశ్నించాడు.

"నిబంధనల ప్రకారం అంపైర్ ఔట్ ఇచ్చినప్పుడు, బ్యాటర్ గౌరవంగా పెవిలియన్ చేరాలి. అంతేకానీ, ఇలాంటి చర్చలకు తావివ్వకూడదు" అని ఆకాశ్ చోప్రా చెప్పాడు.


More Telugu News