ఢిల్లీ-సింగపూర్ ఎయిర్ ఇండియా విమానంలో 2 గంటలు నరకం చూసిన ప్రయాణికులు.. వీడియో ఇదిగో!

  • విమానంలో మొరాయించిన ఏసీ వ్యవస్థ
  • దాదాపు రెండు గంటల పాటు ఉక్కపోత
  • పత్రికలు, మ్యాగజైన్లతో విసురుకుంటూ తీవ్ర ఇబ్బందులు
  • అందరినీ కిందకు దించేసిన విమాన సిబ్బంది
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఎదురైంది. సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ వ్యవస్థలో లోపం తలెత్తడంతో దాదాపు రెండు గంటల పాటు ఉక్కపోతతో అల్లాడిన 200 మందికి పైగా ప్రయాణికులను చివరికి కిందకు దించేశారు. గత రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన.

ఢిల్లీ నుంచి సింగపూర్ బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ2380 రాత్రి 11 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. ప్రయాణికులందరూ విమానంలోకి ఎక్కిన తర్వాత ఏసీ పనిచేయడం మానేసింది. దీంతో లోపల ఉన్నవారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలి కోసం విమానంలోని పత్రికలు, మ్యాగజైన్లతో విసురుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దాదాపు రెండు గంటల పాటు వేచి చూసినా పరిస్థితి చక్కబడకపోవడంతో విమాన సిబ్బంది ప్రయాణికులందరినీ కిందకు దిగిపోవాలని కోరారు. అనంతరం వారిని తిరిగి ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ భవనానికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. సుమారు మూడు నెలల క్రితం జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లిన విమానంలోనూ ఇదే తరహా సమస్య తలెత్తింది. అలాగే, గత మే నెలలో ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విమానంలో గాల్లో ఉండగానే ఏసీ ఫెయిల్ అయిన ఘటన కూడా ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.


More Telugu News