బ్యాంకాక్ లో జూ కీపర్ పై దాడి చేసి చంపేసిన సింహాలు

  • సింహాల దాడి చూసి భయంతో వణికిపోయిన పర్యాటకులు
  • ఎన్ క్లోజర్ లో వాహనంలో నుంచి కిందకు దిగిన జూ కీపర్
  • మూకుమ్మడిగా మీదపడ్డ సింహాల గుంపు
బ్యాంకాక్ లోని సఫారీ వరల్డ్ జూలో విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులను రైడ్ కు తీసుకెళ్లిన జూ కీపర్ సింహాల దాడిలో చనిపోయాడు. ఎన్ క్లోజర్ లో వాహనంలో నుంచి కిందకు దిగడంతో అక్కడే ఉన్న సింహాల గుంపు ఒక్కసారిగా జూ కీపర్ పై దాడి చేసి చంపేశాయి. కళ్ల ముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసిన పర్యాటకులు ప్రాణ భయంతో వణికిపోయారు. సింహాల గుంపును ఎలా ఆపాలో తెలియక హారన్ కొడుతూ, గట్టిగా అరుస్తూ వాటిని బెదిరించాలని చూశారు. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా జూ కీపర్ పై సింహాలు దాడి కొనసాగించాయి.

అధికారులు స్పందించి అక్కడికి చేరుకునేలోపే జూ కీపర్ శరీరాన్ని ముక్కలు చేశాయి. కాగా, ఈ ఘటనపై జూ నిర్వాహకులు స్పందిస్తూ.. గడిచిన 40 ఏళ్లలో ఇలాంటి విషాదకర సంఘటన జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. సింహాల ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించిన తర్వాత పాటించాల్సిన ప్రొటోకాల్ విషయంలో జూ కీపర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని చెప్పారు. వాహనంలో నుంచి బయటకు దిగిన వెంటనే సింహాలు అతడిపై దాడి చేశాయని వివరించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జూ కీపర్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ.. వారికి అండగా ఉంటామని ప్రకటించారు.


More Telugu News