అనంతపురంలో టీమ్ ఎన్డీఏ తొలిసభకు ఏర్పాట్లు పూర్తి

  • అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ పార్టీల తొలి ఉమ్మడి సభ
  • అనంతపురంలో 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' పేరుతో భారీ బహిరంగ సభ
  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • 15 నెలల పాలన, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరణ
  • సుమారు 3.5 లక్షల మంది హాజరవుతారని అంచనా
  • కూటమి ఐక్యతను చాటేలా సభ నిర్వహణ
15 నెలల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తొలిసారి రాష్ట్రంలోని మూడు ఎన్డీఏ పార్టీలు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. అనంతపురంలో 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' పేరిట నిర్వహిస్తున్న ఈ భారీ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడిగా రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్టీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ తదితరులు హాజరు కానున్నారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3.5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లా ఈ సభకు వేదికైంది. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలు నిర్వహించే తొలి రాజకీయ సభ కావటంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించటంపై ఈ సభలో ప్రధానంగా మూడు పార్టీల నేతలు ప్రస్తావించనున్నారు. 

ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరింది. అలాగే రాష్ట్రంలో అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టు ప్రాజెక్టులు సహా వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు పట్టాలెక్కి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనున్న అంశాలను ఈ వేదిక ద్వారా కూటమి పార్టీల అగ్రనాయకత్వం ప్రజలకు వివరించనుంది.

సూపర్ సిక్స్ పథకాల చిహ్నంతో వేదిక

కూటమి సర్కారు అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన లోగోతో రూపొందించిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ తో వేదికను తీర్చిదిద్దారు. 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసీనులయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభ నిర్వహిస్తున్న 70 ఎకరాల ప్రాంగణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట జెండాలను, హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు. 

ఇక వేదిక ప్రాంగణానికి దారితీసే మార్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ, లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరుల ఫ్లెక్సీలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అనంతపురంలోని ప్రధాన కూడళ్లతో పాటు దారి పొడవునా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన జెండాలు, తోరణాలతో సభకు వచ్చేవారిని ఆహ్వానించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు. 

మూడు పార్టీల తరపున ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో అనంతపురంలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే భారీస్థాయిలో జనం తరలిరానున్న నేపథ్యంలో తాగునీరు, భోజనాలకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడే ఆహారం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ఎన్డీఏ పార్టీల ఐక్యతా నినాదం

ఎన్నికలకు ముందు నుంచి కలసికట్టుగా ఉన్న మూడు పార్టీలు.. అధికారంలోకి వచ్చాక కూడా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఐక్యంగానే ముందుకు వెళుతున్నాయి. 15 నెలల పాలనా కాలంలో సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్-మంత్రి లోకేశ్, బీజేపీ అగ్ర నేతలు అత్యంత సమన్వయంతో పనిచేస్తున్నారు. అవసరమైన సమయాల్లో కేంద్రంతో, ప్రధాని మోదీతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం... ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం నినాదాన్ని మరింత బలంగా ఈ వేదిక ద్వారా పంపాలని కూటమి భావిస్తోంది.


More Telugu News