నూతన ఉప రాష్ట్రపతి ఎవరు?.. మోదీ ఓటుతో మొదలైన ఓటింగ్

  • ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం
  • జగదీప్ ధనఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన పదవి
  • ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
  • విపక్షాల తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ
  • సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు, రాత్రికి ఫలితం
దేశ తదుపరి ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. జగదీప్ ధనఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ పదవి కోసం అధికార ఎన్డీయే కూటమి, విపక్షాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

ఎన్డీయే కూటమి తరఫున సీపీ రాధాకృష్ణన్ బరిలో నిలవగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగువారైన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన 'ఎఫ్-101 వసుధ' పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు ఉభయ సభల సభ్యులు తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన గంట తర్వాత సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపును అధికారులు చేపడతారు. లెక్కింపు ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, ఈరోజు రాత్రికల్లా విజేతను ప్రకటించనున్నారు. దీంతో భారత నూతన ఉప రాష్ట్రపతి ఎవరో నేటితో తేలిపోనుంది.


More Telugu News