నడ్డాకు చంద్రబాబు ఫోన్... భారీగా యూరియా కేటాయిస్తూ జీవో జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

  • సమీక్షా సమావేశం నుంచే నేరుగా నడ్డాకు చంద్రబాబు ఫోన్
  • ఏపీకి వెంటనే యూరియా కేటాయించాని విజ్ఞప్తి   
  • 17,293 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తూ కేంద్రం జీవో జారీ
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను నివారించేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. ఎరువుల సరఫరాపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన ఫోన్ చేసి, తక్షణమే యూరియాను కేటాయించాలని కోరారు. కాకినాడ పోర్టుకు చేరుకోనున్న నౌక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అత్యవసరంగా యూరియా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్రమంత్రి నడ్డా వెంటనే సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు తక్షణమే 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చొరవతో కేంద్రం నుంచి కేటాయింపులు జరగడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు.

కేటాయించిన యూరియాను యుద్ధప్రాతిపదికన అవసరమైన జిల్లాలకు తరలించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యూరియాను ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా కేంద్రమంత్రితో మాట్లాడటం వల్లే ఈ కేటాయింపు సాధ్యమైందని తెలిపారు. రాబోయే రబీ సీజన్‌కు కూడా రాష్ట్రానికి అవసరమైన 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించిందని, కాబట్టి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని వ్యవసాయ అధికారులకు ఆయన సూచించారు.


More Telugu News