శ్రీకాంత్ చేసిన వాటిలో ఆ సినిమా అంటే ఇష్టం: నటి ఊహ

  • కెమెరా ముందుకు వచ్చిన ఊహ 
  • 'ఆమె' సినిమాను గురించిన ప్రస్తావన 
  • 'తారకరాముడు' సినిమా ఇష్టమని వెల్లడి
  • పిల్లల కెరియర్ గురించిన వివరణ  
  
టాలీవుడ్ అందాల జంటలలో శ్రీకాంత్ - ఊహ తప్పకుండా కనిపిస్తారు. శ్రీకాంత్ హీరోగా ఎదుగుతున్న రోజులవి. శివరంజని పేరుతో తమిళ .. మలయాళ సినిమాలు చేస్తూ వచ్చి, 'ఊహ' పేరుతో ఆమె తెలుగు తెరకి పరిచయమయ్యారు. 'ఆమె' సినిమాతో ఆమె ప్రయాణం ఇక్కడ మొదలైంది. ఈ సినిమాతో మొదలైన పరిచయం .. ప్రేమగా మారడం .. పెళ్లి వరకూ వెళ్లడం జరిగింది. ఆ తరువాత కెమెరాకు దూరంగా ఉంటూ వచ్చిన ఊహ, తాజాగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. 

"నేను ఇండస్ట్రీకి వచ్చే సమయానికి తెలుగులో వేరే శివరంజని ఉండటం వలన, ఈవీవీగారు నా పేరును 'ఊహ'గా మార్చారు. అప్పటికి నాకు తెలుగు సరిగ్గా రాకపోవడం వలన చాలా భయపడ్డాను. అయితే ఆరంభంలోనే 'ఆమె' సినిమాతో ఒక మంచి పాత్ర పడటం నా అదృష్టం అనిపించింది. 'ఆమె' సినిమాలో శ్రీకాంత్ .. నేను చేసిన ఫస్టు సీన్ .. పెళ్లి సీన్. ఆ తరువాత నిజంగానే మేము పెళ్లి చేసుకోవడం చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది" అని అన్నారు. 

"శ్రీకాంత్ చేసిన సినిమాలలో 'తారకరాముడు' నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలలో అది నా ఫేవరేట్ అని చెప్పొచ్చు. ఆ తరువాత 'ఖడ్గం' అని చెబుతాను. ఆయన సినిమాలలో నచ్చనిది కూడా ఉంది. కాకపోతే అదేమిటనేది చెప్పకూడదు. పెళ్లి తరువాత సినిమాలకి దూరంగా ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇక పిల్లల కెరియర్ విషయానికి వస్తే, తామేం చేయాలనే విషయంలో వాళ్లకి పూర్తి క్లారిటీ ఉంది" అని చెప్పారు. 



More Telugu News