‘కొడితే నీలా కొట్టాలి’.. మౌళిపై బండ్ల గణేశ్ ట్వీట్.. పాత వివాదం మళ్లీ తెరపైకి!

  • 'లిటిల్ హార్ట్స్' సినిమాతో హిట్ కొట్టిన యూట్యూబర్ మౌళి
  • మౌళిని అభినందిస్తూ బండ్ల గణేశ్ ట్వీట్
  • పాత రాజధాని వివాదాన్ని గుర్తు చేసిన బండ్ల పోస్ట్
  • గతంలో ఏపీ రాజధానిపై జోక్‌తో చిక్కుల్లో పడ్డ మౌళి
  • బండ్ల ట్వీట్ డిలీట్ చేసినా.. స్క్రీన్‌షాట్లతో సోషల్ మీడియాలో వైరల్
యూట్యూబ్ కామెడీ వీడియోలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుని, '#90స్' వెబ్ సిరీస్‌తో నటుడిగా నిరూపించుకున్న మౌళి తనూజ్, 'లిటిల్ హార్ట్స్' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ సాధించిందన్న వార్తల నేపథ్యంలో మౌళిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో చురుకుగా ఉండే బండ్ల గణేశ్... మౌళి విజయాన్ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. "కొడితే నీలా కొట్టాలిరా బాబు దెబ్బ.. చంపేసావు.. ఇక దున్నేయ్ టాలీవుడ్ నీదే" అంటూ ఆయన చేసిన పోస్ట్ పైకి ప్రశంసలాగే కనిపించినా, పరోక్షంగా ఒక పాత రాజకీయ వివాదాన్ని గుర్తుచేసేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.

గతంలో 2023లో మౌళి ఒక వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చేసిన జోక్ తీవ్ర దుమారం రేపింది. అప్పట్లో వైసీపీ మద్దతుదారుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పారు. "నా జోక్ వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించండి. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. దయచేసి కుటుంబాన్ని ఇందులోకి లాగవద్దు" అని మౌళి వివరణ ఇచ్చారు. ఇప్పుడు బండ్ల గణేశ్ చేసిన ట్వీట్‌లోని పదాలు ఆ పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్లయింది.

సినిమా మంచి విజయం సాధించిన తరుణంలో ఈ తరహా ట్వీట్ చేయడం వల్ల ఒక వర్గం ప్రేక్షకుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, వివాదం ముదురుతుండటంతో బండ్ల గణేశ్ తన పాత ట్వీట్‌ను తొలగించి, మౌళిని మెచ్చుకుంటూ మరో కొత్త పోస్ట్ పెట్టారు. కానీ, అప్పటికే ఆయన చేసిన అసలు ట్వీట్ స్క్రీన్‌షాట్ల రూపంలో నెట్టింట వైరల్ అయింది. 


More Telugu News