కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు.. ఆటో డ్రైవర్ గొప్ప మనసు!

  • నడిరోడ్డుపై దొరికిన రూ.16 లక్షల విలువైన బంగారు నగలు
  • నిజాయతీ చాటుకున్న నిర్మల్ జిల్లా ఆటో డ్రైవర్
  • కూతురి పెళ్లి కోసం చేయించిన నగలు పోగొట్టుకున్న మహిళ
  • ప్రయాణికురాలి చొరవతో అసలు యజమానికి చేరిన బ్యాగ్
  • డ్రైవర్ సాయికుమార్‌ను సన్మానించిన గ్రామస్థులు
లక్షల రూపాయల విలువైన బంగారం కళ్ల ముందు  కనిపిస్తే ఎవరికైనా మనసు చలిస్తుంది. కానీ, ఓ ఆటో డ్రైవర్ మాత్రం తన నిజాయతీని చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. నడిరోడ్డుపై దొరికిన రూ.16 లక్షల విలువైన బంగారు నగలు, నగదు ఉన్న సంచిని భద్రంగా దాని యజమానికి అప్పగించి గొప్ప మనసును చాటుకున్నాడు. నిర్మల్ జిల్లాలో జరిగిందీ ఘటన.

కడెం ప్రాంతానికి చెందిన సుజాత నిర్మల్‌లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం ఆమె తన కుమారుడితో కలిసి బైక్‌పై నిర్మల్ నుంచి ఖానాపూర్‌కు వెళ్తున్నారు. కుమార్తె పెళ్లి కోసం చేయించిన 16 తులాల బంగారు ఆభరణాలు, కొంత డబ్బు, ముఖ్యమైన పత్రాలు ఉన్న సంచిని వాహనానికి తగిలించారు. కొండాపూర్ బైపాస్ వద్ద ఆ సంచి జారి కింద పడిపోవడాన్ని వారు గమనించలేదు.

అదే సమయంలో లక్ష్మణచాంద మండలం రాచాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సాయికుమార్ తన ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని అటుగా వెళ్తున్నాడు. ఆటోలో ఉన్న వడ్యాల్ గ్రామానికి చెందిన సౌజన్య అనే ప్రయాణికురాలు రోడ్డుపై పడి ఉన్న సంచిని చూసి డ్రైవర్‌కు చెప్పింది. సాయికుమార్ ఆ సంచిని తీసుకుని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు.

మరోవైపు, బంగారం ఉన్న సంచి పోయిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన సందేశాన్ని సౌజన్య చూశారు. వెంటనే ఆమె తన భర్త ద్వారా ఆటో డ్రైవర్ సాయికుమార్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో సాయికుమార్ ఆదివారం బాధితురాలు సుజాతకు సమాచారం అందించారు. వారు రాగానే, సంచిలోని బంగారం, నగదు, గుర్తింపు పత్రాలను యథాతథంగా సుజాతకు అప్పగించారు. కష్టపడి కూతురి పెళ్లి కోసం చేయించిన నగలు తిరిగి దొరకడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సాయికుమార్ నిజాయతీని గ్రామస్థులు, స్థానికులు మెచ్చుకుని ఘనంగా సన్మానించారు.


More Telugu News