హనీమూన్‌ హత్య కేసు... 790 పేజీల ఛార్జ్‌షీట్

  • రాజా రఘువంశీ హత్య కేసులో భార్య సోనమ్‌పై ఛార్జ్‌షీట్
  • ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా సహా మొత్తం ఐదుగురిపై అభియోగాలు
  • కోర్టుకు 790 పేజీల నివేదిక సమర్పించిన మేఘాలయ సిట్
  • హనీమూన్‌కు అని తీసుకెళ్లి భర్తను హత్య చేసిన వైనం
  • సాక్ష్యాలు చెరిపిన మరో ముగ్గురిపై సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్  
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హనీమూన్‌కు అని తీసుకెళ్లి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా సహా మొత్తం ఐదుగురిపై మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఈ ఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సోహ్రా సబ్-డివిజన్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 790 పేజీల ఛార్జ్‌షీట్‌ను సిట్ సమర్పించిందని మేఘాలయ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సోనమ్, ఆమె ప్రియుడు రాజ్‌తో పాటు వారికి సహకరించిన ఆకాశ్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మి, విశాల్ సింగ్ చౌహాన్‌లను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నిందితులందరిపైనా భారతీయ న్యాయ సంహితలోని హత్య (103 (I)), సాక్ష్యాల ధ్వంసం (238 (a)), నేరపూరిత కుట్ర (61 (2)) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

అదనపు ఫోరెన్సిక్ నివేదికలు అందిన తర్వాత, సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలతో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న మరో ముగ్గురిపై సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ తెలిపారు.

కేసు నేప‌థ్యం ఏమిటంటే..!
ఇండోర్‌కు చెందిన రాజా (29), సోనమ్ (24)లకు ఈ ఏడాది మే 11న వివాహం జరిగింది. అయితే, సోనమ్ తమ కుటుంబానికి చెందిన ఫర్నిచర్ వ్యాపారంలో అకౌంటెంట్‌గా పనిచేసే రాజ్‌ కుష్వాహాతో అప్పటికే ప్రేమలో ఉందని పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట, మే 23న ఓ హోంస్టే నుంచి చెక్-అవుట్ అయిన కొన్ని గంటలకే అదృశ్యమైంది.

జూన్ 2న రాజా మృతదేహం లభించడంతో ఈ కేసు హత్యగా మారింది. అప్పటివరకు తప్పించుకుని తిరుగుతున్న సోనమ్, జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అంతకుముందే ఆమెకు సహకరించిన స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా జూన్ 11న, ప్రియుడు, స్నేహితులతో కలిసి భర్తను హత్య చేసినట్లు సోనమ్ అంగీకరించింది. ఈ దారుణ ఘటనపై సోనమ్ సోదరుడు గోవింద్ స్పందిస్తూ... తమ కుటుంబం ఆమెతో అన్ని సంబంధాలు తెంచుకుందని, రాజా కుటుంబానికి న్యాయం జరిగే పోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


More Telugu News