మా అమ్మ గురించి మీ మాటలు కదిలించాయి.. ప్రధాని మోదీకి అల్లు అరవింద్ ఎమోషనల్ లేఖ

  • అల్లు అరవింద్ తల్లి మృతిపై పరామర్శించిన ప్రధాని మోదీ
  • మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన అల్లు అరవింద్
  • మీ ఓదార్పు మాటలు మాకు ధైర్యాన్నిచ్చాయన్న నిర్మాత
  • కనకరత్నం నేత్రదానాన్ని కొనియాడిన ప్రధాని
  • ఎక్స్‌ వేదికగా లేఖను పంచుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, స్టార్ హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్.. ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. ఇటీవల తన తల్లి అల్లు కనకరత్నం గారి మరణం పట్ల ప్రధాని మోదీ చూపిన ఆదరణ, సానుభూతికి సమాధానంగా అరవింద్ ఈ లేఖను విడుదల చేశారు. అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తమ అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా ఈ లేఖను పంచుకుంది.

"గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మా అమ్మ శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి మరణం పట్ల మీరు దయతో పంపిన సందేశానికి నా తరఫున, నా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆమె జీవితం, ఆమె విలువలు, చివరిగా ఆమె చేసిన నేత్రదానం లాంటి ఉదారమైన పనిని మీరు గుర్తుచేసుకున్న తీరు మమ్మల్ని ఎంతగానో కదిలించింది. మీ ఆప్యాయత, గౌరవం మా కుటుంబానికి ఎంతో ఓదార్పునిచ్చాయి. మీ ఆశీస్సులు, ప్రార్థనలు మాకు ఎప్పటికీ ఒక శక్తిగా నిలుస్తాయి" అని అల్లు అరవింద్ తన లేఖలో పేర్కొన్నారు. 

కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్‌కు ప్రధాని మోదీ ఒక సంతాప సందేశం పంపారు. ఆ లేఖలో, "శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. తల్లిని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటు. ఆ లోటును ఎవరూ పూడ్చలేరు. ఆమె దయ, కుటుంబం పట్ల చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె తన కళ్లను దానం చేయాలన్న నిర్ణయం ఎంతో గొప్పది. అది ఆమెలోని దాతృత్వానికి, కరుణకు నిదర్శనం" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు.


More Telugu News