నా ప్రతి సినిమా సాహసమే: దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి

  • అనుష్క కెరీర్‌లో ఐకానిక్‌ ఫిల్మ్‌గా 'ఘాటి' 
  • శీలావతి పాత్రలో అనుష్క 
  • గంజాయి నేపథ్య కథతో 'ఘాటి'
నేను దర్శకత్వం చేసే ప్రతి సినిమా ఓ సాహసం లాంటిదే అంటున్నారు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. ఆయన దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'ఘాటి'. విక్రమ్‌ ప్రభు మేల్‌ లీడ్‌గా నటించిన ఈ సినిమాను రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్‌ మంగళవారం నాడు విలేకరులతో ముచ్చటిస్తూ ఘాటి చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన విశేషాలివి

అనుష్క కెరీర్‌లో ఐకానిక్‌ మూవీ  
ఘాటి మూవీతో అందరూ ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. అనుష్క కెరీర్‌లో ఇది మరో ఐకానిక్‌ ఫిల్మ్‌గా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అనుష్క ఇమేజ్‌ కు తగిన పాత్ర ఇది. ఆమె సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయితే చాలా పెద్ద రేంజ్‌లో ఉంటాయి. 

అరుంధతి నుంచి భాగమతి వరకు ఆ విషయాన్ని రుజువు చేశాయి. ఘాటిలో ఆమె స్ట్రెంగ్త్‌ కు తగ్గ పాత్ర దొరికింది. ఆమె పెర్‌ఫార్మెన్స్‌ మరో లెవల్‌లో ఉండబోతుంది. కథానాయిక ప్రధానంగానే ఈ కథను రాశాం. 'వేదం' సినిమా తరువాత అనుష్కతో మరో సినిమా చేయాలని ఉండేది. ఒకానొక సమయంలో వేదంలో 'సరోజ' పాత్రకు కొనసాగింపుగా ఓ సినిమా చేయాలని అనుకున్నాం. కాని కుదరలేదు. ఈ చిత్రంలో అనుష్క శీలావతి పాత్రలో కనిపించబోతుంది. ఆ పాత్రలో ఆమె గ్రేస్‌, ఆటిట్యూడ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. 

నా జర్నీలో నా ప్రతి సినిమా ఓ సాహసమే 
నా జర్నీలో నా ప్రతి సినిమా ఒక అడ్వెంచర్‌ లాంటిదే. షూటి చిత్ర కథను చింతకింద శ్రీనివాసరావు అనే రచయిత చెప్పిన ఐడియా. మా బ్యానర్‌లోనే తెరకెక్కిన  'అరేబియన్‌ కడలి' అనే వెబ్‌సీరిస్‌కు ఆయన కథ, మాటలు అందించాడు. రకరకాల కథల గురించి డిస్కషన్‌ చేస్తున్నప్పుడు ఆయనే ఈ కథ గురించి చెప్పాడు. 

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల దగ్గర శిలావతి అనే గాంజా రకం సహజంగా పెరుగుతుంది. ఆ గాంజాను మోయడానికి కొంత మంది కూలీలు ఉంటారు. వాళ్లను 'ఘాటీలని పిలుస్తుంటారు. వాళ్ల గురించి, వాళ్ల నేపథ్యం గురించి చెప్పగానే ఎంతో ఆసక్తిగా అనిపించింది. అందుకే ఈ కథతో సినిమాను తీశాం. ఇదొక కొత్త ప్రపంచంలా తీర్చిదిద్దాం. 

ఘాటి పూర్తి ఫిక్షన్‌ కథ 
ఈ సినిమా పూర్తి ఫిక్షనల్‌ కథ. శీలావతి పాత్ర కూడా ఫిక్షనలే. గంజాయి అనేది ప్రభుత్వానికి పెద్ద సమస్య. ప్రభుత్వం గంజాయిని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసిన అవన్నీ దాటుకుని వేర్వేరు దారుల్లో అది సమాజంలోకి వస్తుంది. అందరూ ఎదుర్కొనే సమస్య చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

ప్రతి సన్నివేశం అందరిలో ఎంతో ఉత్కంఠను కలిగిస్తుంది. ఈ చిత్రంలో ఉండే హ్యుమన్‌ రిలేషన్స్‌, ఎమోషన్స్‌ అందరి హృదయాలను హత్తుకుంటాయి. చిత్రంలో విక్రమ్‌ ప్రభు దేశిరాజు పాత్రలో, కుందుల నాయుడు పాత్రలో చైతన్యరావు అందరినీ అలరిస్తారు. 


More Telugu News