చమురు మరింత చౌక.. భారత్ కు తగ్గింపు ధరపై రష్యా పంపిణీ

  • బ్రెంట్ చమురుతో పోలిస్తే 3 నుంచి 4 డాలర్లు తక్కువ ధర
  • సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ లో కొనుగోళ్లకు వర్తింపు
  • అమెరికా బెదిరింపులను లెక్కచేయని భారత రిఫైనరీలు
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ కారణంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం అదనపు సుంకాలు విధించారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఈ విషయంలో అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో చమురు ధరను రష్యా మరింత తగ్గించింది. బ్రెంట్ ధరతో పోలిస్తే బ్యారెల్ పై 3 నుంచి 4 డాలర్ల వరకు తక్కువ ధరకు సరఫరా చేయడానికి అంగీకరించింది.

ఈ తగ్గింపు ధరలు సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ నెలలో జరిపే కొనుగోళ్లకు వర్తిస్తాయని రష్యా ప్రకటించింది. ఈ విషయాన్ని రష్యా గ్రిడ్‌ నుంచి చమురు ఆఫర్‌ అందుకున్న వ్యక్తులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. గత వారం జరిగిన ఉరల్స్‌ గ్రేడ్‌ చమురు కొనుగోలులో బ్యారెల్‌కు 2.5 డాలర్ల డిస్కౌంట్‌ లభించినట్లు సమాచారం. ప్రస్తుతం మన మొత్తం దిగుమతుల్లో రష్యా వాటానే 31.4 శాతంగా ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్‌ (17.1 శాతం), సౌదీ అరేబియా (16.1 శాతం), యూఏఈ (11.8 శాతం) ఉన్నాయి. రష్యా ఎగుమతి చేసే వాటిల్లో ఉరల్స్‌ ముఖ్యమైన చమురు రకం. ఇటీవల కాలంలో సముద్ర మార్గం ద్వారా రష్యా ఉరల్స్‌ చమురును దిగుమతి చేసుకొంటున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది.


More Telugu News