Vasala Sridhar: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ కోసం కట్టుకున్నోడిని కాదంది.. ఆగ్రహంతో కత్తితో గొంతుకోసిన భర్త

Hyderabad Man Stabs Wife for Instagram Lover Then Attempts Suicide
  • ప్రియుడి కోసం కుటుంబాన్ని కాదన్న భార్య
  • భార్య గొంతు కోసి, ఆత్మహత్యాయత్నం చేసిన భర్త
  • 13 ఏళ్ల క్రితం రాంగ్‌కాల్‌తో ప్రేమ వివాహం చేసుకున్న జంట
  • హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో ఘటన
  • భార్యాభర్తలిద్దరూ ఆసుపత్రిలో.. భార్య పరిస్థితి విషమం
సోషల్ మీడియా మోజు ఓ సంసారంలో చిచ్చుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను కాదన్న ఓ వివాహితపై ఆమె భర్త కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన వాసాల శ్రీధర్‌ (34), ఖమ్మం జిల్లాకు చెందిన కల్యాణి (33) పదమూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ రాంగ్‌కాల్‌తో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. ఉపాధి కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట పరిధిలోని పీజేఆర్‌నగర్‌లో నివసిస్తున్నారు.

కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉంటున్న కల్యాణికి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ బంధం శ్రుతి మించి ప్రియుడితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడటం వరకు వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన భర్త శ్రీధర్ పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, ప్రియుడి కోసం విడాకులు ఇస్తానని భర్తకే తేల్చిచెప్పింది.

కుటుంబ సభ్యులు, పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా కల్యాణి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడిన కల్యాణిపై ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీధర్, కత్తితో ఆమె గొంతు, ముఖం, మణికట్టుపై దాడి చేశాడు. ఆ తర్వాత తానూ రెండు చేతుల మణికట్టులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

తీవ్ర గాయాలపాలైనప్పటికీ భర్తను కాపాడాలంటూ కల్యాణి బయటకు పరుగెత్తుకొచ్చి కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కల్యాణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Vasala Sridhar
Instagram affair
Hyderabad crime
Jagadgirigutta
Kalyani
marital dispute
Karimnagar
attempted suicide
social media addiction
infidelity

More Telugu News