మా ఇద్దరి మధ్య పోలిక సరికాదు: వసీమ్ అక్రమ్

  • భారత పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రాపై వసీమ్ అక్రమ్ ప్రశంసలు
  • తనతో బుమ్రాకు పోలిక సరికాదన్న పాక్ దిగ్గజం
  • బుమ్రా సేవలను సరిగా వాడుకుంటున్న బీసీసీఐకి కితాబు
  • మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌పైనా ప్రశంసల వర్షం
  •  సిరాజ్ మానసిక దృఢత్వం, స్టామినా అమోఘమని వ్యాఖ్య
  • బౌలింగ్ దళానికి సిరాజ్ నాయకత్వం వహిస్తున్నాడని కొనియాడింపు
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, స్వింగ్ సుల్తాన్‌గా పేరుగాంచిన వసీమ్ అక్రమ్, టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆధునిక క్రికెట్‌లో బుమ్రా ఒక గొప్ప బౌలర్ అని కొనియాడాడు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో తనతో బుమ్రాను పోలుస్తూ జరుగుతున్న చర్చపైనా అక్రమ్ స్పందించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వసీమ్ అక్రమ్, బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా ప్రత్యేకమైనదని, అతడు అద్భుతమైన పేస్‌తో బంతులు విసరగలడని అన్నాడు. "జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక గొప్ప బౌలర్. నేను ఎడమచేతి వాటం బౌలర్‌ను అయితే, అతను కుడిచేతి వాటం బౌలర్. మా ఇద్దరి మధ్య పోలిక తీసుకురావడం అనవసరం. నా తరంలో నేను గొప్ప, ఈ తరం క్రికెట్‌లో బుమ్రా గొప్ప" అని వసీమ్ అక్రమ్ స్పష్టం చేశాడు. బుమ్రా వంటి కీలక బౌలర్ వర్క్‌లోడ్‌ను భారత క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ) చక్కగా నిర్వహిస్తోందని, అతడి సేవలను సరైన రీతిలో వినియోగించుకుంటున్న ఘనత బీసీసీఐదేనని అక్రమ్ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా, మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా వసీమ్ అక్రమ్ ఆకాశానికెత్తాడు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన ఐదో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు సిరాజ్ బౌలింగ్‌ను తాను ప్రత్యేకంగా గమనించానని తెలిపారు. "సిరాజ్ దాదాపు 186 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ, మ్యాచ్ చివరి రోజు కూడా అదే పట్టుదలతో నిప్పులు చెరిగే బంతులు వేశాడు. అతని స్టామినా, మానసిక దృఢత్వం అమోఘం" అని కొనియాడారు. సిరాజ్ ఇప్పుడు కేవలం సహాయక బౌలర్‌గా మాత్రమే పరిమితం కాలేదని, భారత బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడని వసీమ్ అక్రమ్ ప్రశంసించారు.


More Telugu News