రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు తగలబెడతామన్న మాధవ్... కారణం ఇదే!

  • మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాధవ్ మండిపాటు
  • రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు
  • కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని ప్రకటన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తల్లిని ఉద్దేశించి రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన నైతికంగా పూర్తిగా దిగజారారని మండిపడ్డారు. రాహుల్ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాసపటి క్రితం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాధవ్, రాహుల్ గాంధీని తరిమికొడతామని హెచ్చరించారు.

ప్రధాని తల్లిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలను దహనం చేస్తామని మాధవ్ ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుందని, ఆందోళనలకు పిలుపునిచ్చిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ విసిరిన సవాల్‌కు రాహుల్ గాంధీ తోకముడిచారని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా మాధవ్ గోదావరి పుష్కరాల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతాయని తెలిపారు. ఇప్పటికే దీనిపై కేంద్రమంత్రి షెకావత్ అధ్యయనం చేశారని గుర్తుచేశారు. పుష్కరాల పేరుతో రాజమండ్రిలో శాశ్వత కట్టడాలకు ప్రాధాన్యత ఇస్తామని, ఇందులో భాగంగా చారిత్రక హేవ్ లాక్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు, రాజమండ్రిలోని ఏకేసీ కాలేజ్, ఎన్టీఆర్ పార్క్ వద్ద మాధవ్ ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.


More Telugu News