నా పెళ్లి సినిమా స్టైల్‌లో జరిగింది.. నా భార్య ఢిల్లీలో చదువుకుంది, నేను ప్రభుత్వ బడిలో చదువుకున్నా.. సీఎం రేవంత్ ఆసక్తికర ప్రేమకథ

  • తనది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమన్న రేవంత్
  • భార్య గీతతో నాగార్జున సాగర్‌లో పరిచయమైందని వెల్లడి
  • జీవితంలో ఒక్కసారి కూడా సిగరెట్ తాగలేదన్న సీఎం
  • రాహుల్ గాంధీ నుంచి ఫిట్‌నెస్ సలహాలు తీసుకుంటానని వ్యాఖ్య
  • ఖాళీ సమయాల్లో మనవడితోనే గడుపుతానన్న రేవంత్
రాజకీయాల్లో తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. తన ప్రేమ, వివాహం అచ్చం సినిమా కథలా జరిగిందంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహమని, మొదట తాను ప్రేమలో పడిన తర్వాత అది పెద్దల ఆశీస్సులతో పెళ్లిగా మారిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు.

తన భార్య గీతతో తొలి పరిచయం ఊహించని రీతిలో జరిగిందని రేవంత్ రెడ్డి వివరించారు. "ఒకసారి విజయవాడలో అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సభ జరిగింది. ఆ సభకు హైదరాబాద్ నుంచి కొందరితో కలిసి వెళ్లాను. తిరిగి వస్తున్నప్పుడు నాగార్జున సాగర్‌లో ఆగాం. అదే సమయంలో గీత తన కుటుంబంతో అక్కడికి వచ్చారు. అక్కడే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది" అని ఆయన తెలిపారు. ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారి, చివరికి పెళ్లికి దారితీసిందని చెప్పారు. తన భార్య ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరాం కాలేజీలో చదివితే, తాను తెలంగాణలోని ఒక ప్రభుత్వ బడిలో చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు.

    తన వ్యక్తిగత అలవాట్ల గురించి మాట్లాడుతూ జీవితంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిగరెట్ తాగలేదని, అదే తన సంకల్ప బలానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొదట్లో తనకు టీ తాగే అలవాటు కూడా ఉండేది కాదని, విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే సమయంలో హైదరాబాద్‌లో ఆ అలవాటు మొదలైందని చెప్పారు. తాను ఫుట్‌బాల్ ఆటగాడినని, సమయం దొరికినప్పుడల్లా రాహుల్ గాంధీ నుంచి ఫిట్‌నెస్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకుంటానని ఆయన తెలిపారు. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా, కాస్త సమయం దొరికితే తన మనవడితో ఆడుకుంటూ గడపడమే తనకు అత్యంత ఇష్టమని రేవంత్ రెడ్డి చివరగా పేర్కొన్నారు.


More Telugu News