కోర్టు తీర్పు తర్వాత ట్రంప్ పోస్ట్.. టారిఫ్‌లతో ట్రిలియన్ల డాలర్లు వస్తున్నాయన్న అధ్యక్షుడు

  • ట్రంప్ టారిఫ్‌లపై ఫెడరల్ కోర్టు కీలక తీర్పు
  • అధ్యక్షుడిగా అధికార పరిధిని అతిక్రమించారని వెల్లడి
  • సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్‌కేనని స్పష్టీకరణ
  • టారిఫ్‌లతో ట్రిలియన్ల డాలర్లు వస్తున్నాయన్న ట్రంప్
  • తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానంటున్న అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఏకపక్షంగా విధించిన కొన్ని టారిఫ్‌లు (సుంకాలు) చెల్లవని, అది ఆయన అధికార పరిధిని అతిక్రమించడమేనని కోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చి చెప్పింది.

శుక్రవారం వెలువడిన ఈ తీర్పులో, సుంకాలు విధించే అధికారం రాజ్యాంగం ప్రకారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని న్యాయస్థానం నొక్కి చెప్పింది. పన్నులు, వాణిజ్యానికి సంబంధించిన విషయాల్లో అధ్యక్షుడికి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని వివరించింది. అధ్యక్షుడికి కొన్ని అత్యవసర అధికారాలు కట్టబెట్టే 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద సుంకాలు విధించే అధికారం రాదని కోర్టు స్పష్టం చేసింది.

అయితే, ఈ తీర్పు వెలువడిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య విధానాలను గట్టిగా సమర్థించుకున్నారు. తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఆయన ఒక పోస్ట్ చేస్తూ, తాను విధించిన టారిఫ్‌ల వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ల కొద్దీ డాలర్లు వచ్చి చేరుతున్నాయని ప్రకటించారు.

"అమెరికాలో ధరలు భారీగా తగ్గాయి, ద్రవ్యోల్బణం దాదాపు లేదు. ఇంధన ధరలు, ముఖ్యంగా గ్యాసోలిన్ ధరలు అనేక సంవత్సరాల కనిష్ఠానికి చేరాయి. దశాబ్దాలుగా మనల్ని దోచుకున్న దేశాల నుంచి ట్రిలియన్ల డాలర్లను తీసుకొస్తున్న గొప్ప టారిఫ్‌లు ఉన్నప్పటికీ ఇదంతా సాధ్యమైంది. ఈ సుంకాలు అమెరికాను మళ్లీ బలంగా, గౌరవంగా నిలబెడుతున్నాయి" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఈ తీర్పు అమలును అక్టోబర్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ లోగా ట్రంప్ వర్గం అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని ట్రంప్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. వేరే చట్టం కింద విధించిన స్టీల్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై టారిఫ్‌లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.


More Telugu News