కుప్పంలో కృష్ణా జలాల సంబరం.. చెరువులో బోటు షికారు చేసిన సీఎం చంద్రబాబు

  • కుప్పానికి తొలిసారిగా చేరిన హంద్రీ-నీవా కృష్ణా జలాలు
  • పరమసముద్రం చెరువు వద్ద సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • బోటులో చెరువును పరిశీలించి, ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి
  • నియోజకవర్గంలోని 66 చెరువులకు అందనున్న సాగునీరు
  • సుమారు 3,200 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం
దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. కరవు నేలగా పేరుపడ్డ ఈ ప్రాంతానికి హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలు తొలిసారిగా తరలిరావడంతో నియోజకవర్గమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించి, ప్రజల ఆనందంలో పాలుపంచుకున్నారు.

శనివారం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి, నియోజకవర్గంలోని చివరి భూములకు నీరందించే పరమసముద్రం చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు, కృష్ణా జలాలతో నిండుకుండలా మారిన చెరువును స్థానికుల కోరిక మేరకు ఆయన బోటులో ప్రయాణించి పరిశీలించారు. బోటులో ప్రయాణిస్తూ, ఒడ్డున ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.

హంద్రీ-నీవా జలాల రాకతో కుప్పం నియోజకవర్గంలోని 66 చెరువులను నింపనున్నారు. దీనివల్ల సుమారు 3,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. గత మూడు నాలుగు రోజులుగా కాల్వల ద్వారా వస్తున్న కృష్ణమ్మ నీటిని చూసి స్థానిక ప్రజలు, రైతులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. నీటిలో తడుస్తూ, కృష్ణా జలాలకు స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా, గత ప్రభుత్వం డమ్మీ గేట్లు పెట్టి తమను మోసం చేసిందని కొందరు స్థానికులు గుర్తుచేసుకున్నారు.

సభా ప్రాంగణంలో 1989 నుంచి కుప్పంలో వ్యవసాయం, సాగునీరు, పారిశ్రామిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ అధికారులు రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. కుప్పం నీటి కష్టాలు ఎలా తీరాయో ఈ వీడియోలో వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనతో కుప్పంలో సందడి వాతావరణం నెలకొంది.


More Telugu News