ఆ విషయాన్ని కోహ్లీ ఎప్పటికీ బహిర్గతం చేయకపోవచ్చు: మనోజ్ తివారి

  • టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఆకస్మిక వీడ్కోలు
  • రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక విశ్లేషణ
  • చుట్టూ ఉన్న వాతావరణం నచ్చకే ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్య 
  • మరో 3-4 ఏళ్లు ఆడే సత్తా ఉన్నా తప్పుకున్నాడని అభిప్రాయం
  • కోహ్లీ ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడని పేర్కొన్న తివారీ 
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు అకస్మాత్తుగా వీడ్కోలు పలకడం వెనుక ఉన్న అసలు కారణం బహుశా ఎప్పటికీ బయటకు రాకపోవచ్చని భారత మాజీ ఆటగాడు మనోజ్ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత ఫిట్‌నెస్‌తో ఇంగ్లాండ్ సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న తరుణంలో కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజాగా మనోజ్ తివారీ మాట్లాడుతూ... “నిజానికి తెర వెనుక ఏం జరిగిందో విరాట్‌కు మాత్రమే తెలుసు. కానీ ఆ విషయాన్ని అతను బహుశా ఎప్పటికీ బయటపెట్టకపోవచ్చు. నాకు తెలిసి దేవుడు తనకు ఇచ్చిన దానితో అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాడు. ఆ చింతన ఉన్నవారు గతాన్ని పెద్దగా పట్టించుకోరు, వర్తమానంపైనే దృష్టి పెడతారు” అని అన్నారు.

కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం తనతో పాటు అభిమానులందరినీ షాక్‌కు గురిచేసిందని తివారీ పేర్కొన్నారు. “విరాట్ ఫిట్‌నెస్ గురించి మనందరికీ తెలుసు. మరో మూడు నుంచి నాలుగేళ్ల వరకు అతను సులభంగా టెస్టులు ఆడగలడు. ఇంగ్లాండ్ సిరీస్‌ కోసం రంజీలు కూడా ఆడి సిద్ధమయ్యాడు. అయితే, తన చుట్టూ ఉన్న వాతావరణం అతనికి నచ్చి ఉండకపోవచ్చు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు” అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది మే 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో 123 టెస్టులు ఆడిన కోహ్లీ, 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా 68 టెస్టులకు నాయకత్వం వహించి 40 విజయాలు అందించాడు. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుతంగా రాణించిన కోహ్లీ, అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. 


More Telugu News