ఢిల్లీకి బయల్దేరిన తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం... ఎల్లుండి బీహార్ కు!

  • ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై న్యాయసలహా తీసుకోనున్న నేతలు
  • ఈనెల 27న బీహార్‌లో రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొననున్న సీఎం, మంత్రులు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశంలో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కుముడులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి పయనమయ్యారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో వారు చర్చించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు రాష్ట్రపతి వద్ద, ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంపై న్యాయసలహా తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత వీరు ఎల్లుండి (ఆగస్టు 27) బీహార్ వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న ఎన్నికల పాదయాత్రలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు తెలంగాణ మంత్రులు కూడా ఈ యాత్రకు హాజరుకానున్నారు. 


More Telugu News