పెళ్లి గురించి తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ మధ్య ఆసక్తికర సంభాషణ!

  • చిరాగ్ పాసవాన్‌కు ఇక పెళ్లి చేసుకోవాలన్న తేజస్వీ యాదవ్
  • ఆ సూచన తనకూ వర్తిస్తుందన్న రాహుల్ గాంధీ
  • పెళ్లిపై లాలూ ప్రసాద్ యాదవ్‌తో మాటమంతీ కొనసాగుతోందన్న రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, రాహుల్ గాంధీ మధ్య చోటుచేసుకున్న సరదా సంభాషణ నవ్వులు విరజిమ్మింది.

'ఓటర్ అధికార్ యాత్ర'లో భాగంగా అరారియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్‌కు ఇక పెళ్లి చేసుకోవాలని సూచించారు. దీనిపై పక్కనే కూర్చున్న రాహుల్ గాంధీ స్పందించారు. వెంటనే రాహుల్ మైక్ అందుకుని "ఆ సూచన నాకూ వర్తిస్తుంది" అంటూ నవ్వులు పూయించారు.

తదుపరి తేజస్వీ స్పందిస్తూ, "ఇదే విషయాన్ని మా నాన్న (లాలూ ప్రసాద్ యాదవ్) ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా" అని వ్యాఖ్యానించగా, రాహుల్ గాంధీ వెంటనే స్పందిస్తూ, ‘అవును, దీనిపై ఆయన (లాలూ ప్రసాద్ యాదవ్)తో సంభాషణ కొనసాగుతోంది’ అంటూ రాహుల్ చమత్కరించారు.

రెండేళ్ల క్రితం పట్నాలో రాహుల్ గాంధీ పెళ్లిపై లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో మాట్లాడి నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. 'మా మాట విని పెళ్లి చేసుకో.. మేమంతా నీ బరాత్‌ (వివాహం)కు రావాలనుకుంటున్నాం. వివాహానికి విముఖత చూపుతుండటంతో మీ అమ్మ (సోనియా గాంధీ) ఆందోళన చెందుతోంది' అని లాలూ నాడు వ్యాఖ్యానించారు. తాజా సమావేశంలో ఇదే విషయాన్ని రాహుల్ ప్రస్తావనకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

గంభీరమైన రాజకీయ చర్చల మధ్య నేతలు ఇద్దరు చేసిన ఈ హాస్యాస్పద వ్యాఖ్యలు అక్కడి ప్రజలను, మీడియా ప్రతినిధులను నవ్వించాయి. 


More Telugu News